ప్రజా పాలనలో దరఖాస్తుల కొరత

by Sridhar Babu |
ప్రజా పాలనలో దరఖాస్తుల కొరత
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం కొన్ని చోట్ల సాఫీగా సాగినప్పటికీ మరికొన్ని చోట్ల ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇదే ఆసరాగా కొంతమంది మీసేవ, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయమై ప్రత్యేక అధికారి జగదీశ్ ను స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున దరఖాస్తు ఫారాలను అందించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతోనే అవి ప్రతి కుటుంబానికి చేరలేదని, ప్రజలు ఇబ్బంది పడుతూ దరఖాస్తు ఫారాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఇదే విధానం ప్రతి గ్రామంలో కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీఓ భుజంగ్ రావు వెంటనే కిష్టాపూర్ చేరుకొని దరఖాస్తు ఫారంల కొరత లేదని, ప్రజలకు ఎన్ని అవసరమైతే అన్ని అందజేస్తామని తెలపడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొన్ని మీసేవలు, జిరాక్స్ సెంటర్లపై ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ భాను ప్రకాష్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story