పీడీఎస్ బియ్యానికి కేరాఫ్ గా ఉమ్మడి మండలం..

by Sumithra |
పీడీఎస్ బియ్యానికి కేరాఫ్ గా ఉమ్మడి మండలం..
X

దిశ, కోటగిరి : కోటగిరి ఉమ్మడి మండలం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డాగా మారింది. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం సంబందించిన మండలంలోని రైస్ మిల్లులకు కమిషన్ చెల్లించి, బియ్యం తీసుకుంటుంది. అయితే ఇదే అదునుగా తీసుకొని కొన్ని రైస్ మిల్లలు (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ ను స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకొని ప్రభుత్వానికి అందించడంలో విఫలం అవుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన వడ్లను స్వలాభం కోసం మిల్లింగ్ చేసిన రైస్ ను ఎక్కువ ధరలకు పక్కరాష్ట్రాలకు ఎగుమతి చేసి లాభాలను గడించి సీఎంఆర్ అప్పగించే విషయంలో కొందరు రైస్ మిల్లర్లు ప్రక్కమండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి పీడీఎస్ రైస్ ను తక్కువ ధరలకు కొనుగోలు చేసి పగలురాత్రి తేడా లేకుండా రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్న సంబంధిత శాఖ అధికారులలో మాత్రం చలనం లేదు.

అక్రమాలను అడ్డుకొనే అధికారులు మాత్రం మౌనంగా ఉండడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అంతే కాకుండా మహారాష్ట్ర నుండి పీడీఎస్ బియ్యం పోతంగల్ చెక్ పోస్ట్ గుండా నిత్యం చాలా వాహనాలలో అక్రమంగా ఉమ్మడి కొటగిరి మండలంతో పాటు పక్కమండలాలకు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారు. పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎట్టకేలకు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని పోలీసులు పోతంగల్ రెండవ బ్రిడ్జి వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

గతంలో కలెక్టర్ ఆగ్రహం..

జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్న విషయం గ్రహించిన గత జిల్లాకలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత జిల్లాఅధికారుల పై ఆగ్రహించి వెంటనే అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి అధికారులలో మాత్రం చలనం రావడం లేదు.

శాఖపరమైన చర్యలు తీసుకుంటాం : ఎన్ఫోర్స్మెంట్ డీటీ - నిఖిల్

అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేయడం, రైస్ మిల్లర్లు రీసైకిలింగ్ చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని. చాలాసార్లు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న పలువాహనాలను పట్టుకుని సీజ్ చేశామని తెలిపారు. అక్రమాలను అడ్డుకునేందుకు రాత్రి సమయాలలో స్పెషల్ టీంలు తిరుగుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

Next Story