Kidnap : జీజీహెచ్ లో మూడేళ్ల బాలుడి కిడ్నాప్…గంటల వ్యవధిలోనే ట్రేస్

by Kalyani |
Kidnap : జీజీహెచ్ లో మూడేళ్ల బాలుడి కిడ్నాప్…గంటల వ్యవధిలోనే ట్రేస్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి శనివారం తెల్లవారుజామున మూడేళ్ల బాలుడు అరుణ్ (3) అనే బాలుడు కిడ్నాప్ గురవడం జిల్లాలో కలకలం రేపింది. పోలీసు యంత్రాంగం దీన్ని సవాల్ గా తీసుకుని ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి శనివారం రాత్రి వరకు నిందితుల కదలికలపై నిఘా పెట్టి బాలుడి ఆచూకీని తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో బాలుడి ఆచూకీని కనుగొన్నారు. జీజీహెచ్ నుంచి బాలుడ్ని కిడ్నాప్ చేసిన దుండగుల కదలికలను తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసి నిందితుల కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు.

అసలు కిడ్నాప్ ఎలా జరిగిందంటే..

మాక్లూర్ మండలం మానిక్ భండార్ కు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం తన భార్యను డెలివరీ కోసం జీజీహెచ్ కు తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడు అరుణ్ తో కలిసి ఆస్పత్రిలోని కారిడార్ లో పడుకున్నారు. తండ్రి, బిడ్డి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చడీ చప్పుడు లేకుండా వచ్చి తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో బాలుడు మంచి నిద్రలో ఉండటంతో ఏడవకుండా ఉండిపోయాడు. ఇది కిడ్నాపర్లు అనుకూలంగా మారింది. దాంతో దర్జాగా బాబును భుజాన వేసుకుని ఎత్తుకెళ్లిపోయారు. ఇదంతా ఆస్పత్రిలోని సీసీటీవీ లో రికార్డయింది.

ఈ ఘటన జరిగిన కాసేపటికి నిద్రలేచిన బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించకపోయేసరికి ఆందోళనకు గురై ఆస్పత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించక పోవడంతో తన కొడుకు కిడ్నాప్ కు గురైనట్లు గ్రహించి ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఒకటో టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ముందుగా ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీస్కెళ్ళారనే విషయాన్ని తెలుసుకోడానికి ఆస్పత్రి పరిసరాల్లో, బస్టాండు, నగరంలోని ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు.

నగరం దాటి వెళ్లే అవకాశం ఉందనే అనుమానంతో జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించారు. సీసీ టీవీ లో రికార్డయిన నిందితుల ఫోటోలను కూడా అన్ని స్టేషన్లకు చేరవేశారు. కిడ్నాప్ కేసును సవాల్ గా తీసుకున్న పొలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపును ముమ్మరం చేశారు. కిడ్నాప్ జరిగిన మరుక్షణం నుండి పోలీసులు క్షణం తీరిక లేకుండా శ్రమించి బాలుడి ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాప్ కథకు సుఖాంతంగా ముగింపు పలికారు. ఓ తల్లి పేగు బంధాన్ని దూరం కాకుండా పోలీసులు బాబును తిరిగి తల్లి ఒడికి చేర్చిన పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు.

జీజీహెచ్ లో ఈ ఘటన మొదటిది కాదు..

జీజీహెచ్ లో గతంలో కూడా

ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కు గురైన వారిని ట్రేస్ అవుట్ చేసి, నిందితులను కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కూడా పోలీసుల సామర్థ్యం పైనే బాధిత తల్లిదండ్రులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆస్పత్రిలో రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ బాలుడి కిడ్నాప్ వ్యవహారం హాస్పటల్ లో రక్షణ వ్యవస్థలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed