Delhi: ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. కోర్టుల్లో వర్చువల్ గా వాదనలు

by Shamantha N |
Delhi: ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. కోర్టుల్లో వర్చువల్ గా వాదనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో వాయు కాలుష్యం (Delhi pollution) తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు భారత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే జడ్జీలు వర్చువల్‌ (online mode)గా వాదనలు వినిపించాలని సూచించారు. ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. అయితే, కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాప్-4(GRAP-4) పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్‌ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. అలానే, వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది.

వాయుకాలుష్యం

ఇకపోతే, ఢిల్లీలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో గత ఏడ్రోజులుగా గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది. ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యం(Air Pollution in Delhi) నుంచి తప్పించుకనేందుకు ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPBC) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది. కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) కింద ఆంక్షలను తక్షణమే విధించాలని సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య తీవ్రతదృష్ట్యా 10, 12 తరగతులు మినహా మిగితా వారికి క్లాసులు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. విషపూరిత గాలి నుండి విద్యార్థులను కాపాడేందుకే ఆన్‌లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు పనిచేయనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed