వేలాది కోట్ల అవినీతికి కేరాఫ్ కేసీఆర్

by Sridhar Babu |   ( Updated:2023-11-03 13:30:49.0  )
వేలాది కోట్ల అవినీతికి కేరాఫ్ కేసీఆర్
X

దిశ, కామారెడ్డి : వేలాది కోట్ల రూపాయల అవినీతికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కిషన్ రెడ్డికి రాజంపేట మండలం పొందుర్తి వద్ద వేలాది మంది బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ వరకు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ర్యాలీ చేపట్టారు. కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంటుందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కేంద్రప్రభుత్వం నిధులతో వేసిన రోడ్లు తానే వేసినట్టు చెప్పుకుంటున్నాడన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో కారులో డీజిల్ పోయడానికి డబ్బులు లేని కేసీఆర్ నేడు తనకు మద్దతిస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు తానే పెడతాననేలా అవినీతికి పాల్పడ్డాడన్నారు. లక్ష 20 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయే పరిస్థితికి కేసీఆరే కారణమన్నారు. 1969 లో 365 మంది విద్యార్థులు, మలిదశ ఉద్యమంలో 1200 మందిని కాంగ్రెస్ పార్టీ బలితీసుకున్నదన్నారు. అలాంటి త్యాగాల తెలంగాణలో ఫార్మ్ హౌస్ లో పడుకోవడం కోసం, అవినీతి చేయడానికి, కుటుంబ పాలనకు కేసీఆర్ ను గెలిపించాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు లేరని, ద్రోహులు మాత్రమే ఉన్నారని తెలిపారు.

ఒక భుజం మీద అక్బరుద్దీన్, మరొక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని పెట్టుకుని వంగివంగి దండాలు పెడుతున్నారన్నారు. గజ్వేల్ లో రెండుసార్లు గెలిచిన కేసీఆర్ అక్కడ ఒడిపోతానని తెలిసి మూట ముల్లె సర్దుకుని కామారెడ్డికి వస్తున్నారన్నారు. తెలంగాణ భవిష్యత్తు కామారెడ్డి ప్రజల చేతిలో ఉందన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ను ఓడించి బీజేపీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇచ్చి అయోధ్యకు తీసుకురావాలన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడం కాదని, తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ను ప్రక్షాళన చేస్తారన్నారు. కోట్లు కుమ్మరించి ఇక్కడి ప్రజలను కొనుగోలు చేసి గెలుస్తానని కేసీఆర్ అనుకుంటున్నాడని, కామారెడ్డి ప్రజలు అంగట్లో పశువులు కాదని, పులి బిడ్డలన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed