కడగండ్లు మిగిల్చిన వడగండ్లు

by Mahesh |
కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
X

దిశ, భిక్కనూరు: ప్రకృతి ఒక్కసారిగా వికృత రూపం దాల్చింది. ఫలితంగా వడగండ్ల వాన దంచి కొట్టడం, దాని దాటికి వేల ఎకరాల్లో వరి పంట నేల కొరగడం, చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న కర్రలు పడిపోవడం, ఖా త కాసిన మామిడి నేల రాలడం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, బోర్లు వట్టి పోవడంతో అతలాకుతలమవుతున్న రైతన్నకు, ఊహించని విధంగా కురిసిన వడగండ్ల వాన తీరని నష్టాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున పంట పొలాలకు వెళ్లి నీట మునిగిన వరిని చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

పంట చేతికొచ్చే పరిస్థితి ఏమాత్రం కానరాకపోవడంతో నేలపై కూర్చొని లబోదిబోమంటున్నారు. పెట్టుబడులు పెరిగిపోవడం, కూలీలు పెరిగిపోవడం, మసాలా ధరలు ఆకాశాన్ని అంటడం, వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు, కూరగాయలు కురిసిన వడగండ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి, భిక్కనూరు, రామేశ్వర్ పల్లి, తిప్పాపూర్, దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామాల్లో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి, ముఖ్యంగా లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలో సుభాన్ రెడ్డికి చెందిన బొప్పాయి జామ వంటి పండ్ల తోటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 30 ఏళ్ల చరిత్రలో నిన్న రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన ను ఇంతవరకు చూడలేమని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి దిగారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా పంట నష్టాన్ని నివేదిక తయారు చేసి అధికారులకు పంపుతామని తహసీల్దార్ శివప్రసాద్ "దిశ" తో మాట్లాడుతూ చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సైతం, కురిసిన వర్షం వల్ల నష్టపోయిన వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు..

గ్రామాల్లో నిలిచిపోయిన కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు ట్రాన్స్ కో సిబ్బంది నిమగ్నమయ్యారు.మండలంలోని వివిధ గ్రామాల్లో కరెంటు స్తంభాలు పడిపోవడం, మరి కొన్నిచోట్ల కరెంటు తీగలపై చెట్లు ఒరగడం తో రాత్రి నుంచి కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తెల్లవారుజామునే గ్రామాల్లోకి వెళ్లి కరెంటు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story