వడగండ్లు...కడగండ్లు

by Sridhar Babu |

దిశ, భిక్కనూరు : నిజామాబాద్​ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం ప్రజలను ఆగం చేసింది. అకస్మాత్తుగా చిరుజల్లులతో మొదలైన వర్షం ఆ తర్వాత కొద్ది సేపటికి భారీ వడగళ్ల వర్షంగా మారింది. శనివారం రాత్రి భిక్కనూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో దంచి కొట్టిన ఈ వర్షం కొద్దిసేపు అందరినీ ఆగం చేసింది. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ వర్షం మునుపెన్నడూ లేని విధంగా కురవడంతో, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కుప్పలు తెప్పలుగా వడగండ్లు పడ్డాయి.

కురిసిన వర్షం వెలిసిన తరువాత వాటిని చేతిలో పట్టుకొని వామ్మో ఇంత పెద్ద వడ గండ్లు కురిసాయా అంటూ ఆశ్చర్యపోయారు. 10 నిమిషాల పాటు కురిసిన వడగళ్ల వాన ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఓ పక్క ఈదురుగాలులు, మరోపక్క ఉరుములు మెరుపులు మెరవడం, పెద్ద ఎత్తున పిడుగు పడినట్లు భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. వడగళ్ల వాన దంచి కొట్టడంతో హైవే తో పాటు, ప్రధాన దారులపై రాకపోకలు సాగించే ఫోర్ వీలర్ వాహనదారులు రోడ్డు పక్కకు ఆపుకున్నారు. ప్రధానదారులన్నీ కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

దిశ, తాడ్వాయి : మండలంలోని పలు గ్రామాల్లో గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. వాతావరణలో వచ్చిన మార్పుల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మండల కేంద్రంలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. శబరి మాత గుడి దగ్గరలో విద్యుత్ వైర్లు తెగి రోడ్డు పై పడి ఉన్నాయి.

ఎక్కడికక్కడే చెట్లుకూలి విద్యుత్‌ లైన్లపై పడడంతో విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. గాలి వాన ధాటికి ఇంటి పై రేకులు సైతం ఎగిరి పోయాయి. కృష్ణజివాడి గ్రామానికి చెందిన రైతు రేకుల షెడ్డు కూలి పశువులకు గాయలయ్యాయి. బ్రాహ్మజీవాడి గ్రామంలో రైతుకు చెందిన రెండు గేదెలు, ఆవు మృతి చెందాయని, మరి కొన్ని పశువులకు గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ గాలి వాన రైతులకు తీరని నష్టాన్నే మిగిల్చింది.

Advertisement

Next Story