అమ్మాయిలు ఇంటర్మీడియట్ తో చదువు ఆపెయొద్దు

by Sridhar Babu |
అమ్మాయిలు ఇంటర్మీడియట్ తో చదువు ఆపెయొద్దు
X

దిశ,నిజాంసాగర్ : అమ్మాయిలు ఇంటర్మీడియట్ తో చదువు ఆపెయొద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల, కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతిభలో ఏ మాత్రం తీసిపోరని, ఎందులోనూ మీరు తక్కువ కాదని అన్నారు.

ప్రైవేట్ కాలేజ్ లకు వెళ్లలేక ప్రభుత్వ కళాశాలకు వస్తున్నామని కొందరు విద్యార్థులు ఆత్మనూన్యతా భావంతో ఉంటారని, అది తప్పని, ప్రైవేట్ కాలేజీలో ఉండే సిబ్బంది కంటే ప్రభుత్వ పాఠశాలలు మరియు కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్ అన్ని విధాలుగా అర్హత పొంది ఉంటారని తెలిపారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప మేధావులు అందరూ ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకున్నవారే ఉన్నారని, తాను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి స్థిరపడాలంటే ఇంటర్మీడియట్ చాలా కీలకం అని అన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు ప్రపంచంలో

చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఉన్నత విద్యలో ఏ కోర్సు ఎక్కువ, తక్కువ అని ఉండదు కాబట్టి మీరు రాణించగల రంగంలో కష్టపడి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అమ్మాయిలు ఇంటర్మీడియట్ తో చదువు ఆపెయొద్దని పై చదువులు చదవాలని కోరారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలో ఎల్కేఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు పాషా సెట్, స్థానిక ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story