కాంగ్రెస్‌లో పదవుల పందేరం

by Mahesh |
కాంగ్రెస్‌లో పదవుల పందేరం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల నగారా మోగకముందే కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం జరిగింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 37 కార్పొరేషన్‌ల చైర్మన్ లను భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని బరిలో నిలిచి ఉండాలని ఆశించిన నేతలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు పదవులను కట్టబెట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అక్కడ కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డిని బరిలో దించడం తో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీసీ కోటాలో బరిలో ఉంటానని చాలా రోజులుగా ప్రచారం చేస్తున్న ఈరవత్రి అనిల్ కు కీలకమైన స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దానితో ఆయన పార్లమెంట్ ఎన్నికల రేసు నుంచి తప్పుకొని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రూట్ క్లియర్ అయిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర కిసాన్ కే కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఆయన రాష్ట్ర కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో ఆర్మూర్ లేదా బాల్కొండ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ ఆయనను కాదని ఇతరులకు టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పు కొన్నందుకు ఆయనకు కార్పొరేషన్ పదవి లభించింది.

కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గా గతంలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాలరాజుకు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీ చేస్తానని కాసుల బాలరాజు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు తనకు టికెట్ దక్కలేదని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆనాడు కాంగ్రెస్ పెద్దలు కాసుల బాలరాజును పోటీ నుంచి విరమింపజేసిన ప్రస్తుతం కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న మోహన్ రెడ్డి గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ మోహన్ రెడ్డిని కాదని ఇతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది.

Advertisement

Next Story