కాంగ్రెస్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-07-17 15:37:47.0  )
కాంగ్రెస్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, భీమ్‌గల్ : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభలో రైతులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నరో చెప్పాడు. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తే కాంగ్రెస్ కు ఏం నష్టమని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ లో కేవలం 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందన్నారు. వాళ్లు మిగుల్చుకుని మనకు అమ్ముతున్నారని, అదే మనం కొంటున్నామని తెలిపారు. అదే కరెంట్ ను ఇక్కడ రైతులకు సరఫరా చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఆర్టీఏ అప్లికేషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ నుంచి కరెంట్ తెచ్చుకునేందుకు లైన్లు కూడా లేవన్నారు.

60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కనీసం లైన్లు కూడా వేసుకోలేదని అన్నారు. అదేవిధంగా రూ.80 వేల కోట్లతో పూర్తయిన కాళేశ్వరానికి లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనడం హస్యాస్పదమని అన్నారు. బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని, కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులు ఆలోచన చేయాలని, మోసపోతే గోసపడతామని సూచించారు.

ఎంపీ అరవింద్ పై మంత్రి వేముల ఫైర్..

పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి మోసం చేసి అరవింద్ ఎంపీ అయ్యాడని ఆరోపించారు. రైతులను మోసం చేసి దర్జాగా తిరుగుతూ కష్టపడుతున్న మా లాంటి వాళ్లను ఇష్టం వచ్చినట్లు, మాటలు మాట్లాడుతున్నడని మంత్రి ఫైర్ అయ్యారు. నాలుగున్నరేళ్లలో తప్పు చేయని ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు చేస్తాడా.. ఇప్ప్పుడే ఎన్నికల ముందు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని మంత్రి కోరారు. ఎంపీకి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు.

సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద కేంద్రం రూ.300 కోట్లు కేటాయించిందని, అందులో రూ.70 కోట్లు బాల్కొండ నియోజకవర్గ రోడ్లకు, బ్రిడ్జికి కేటాయించుకున్నామని తెలిపారు. అవన్ని తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story