పోలింగ్ సమయం పెంపు

by Disha Web Desk 15 |
పోలింగ్ సమయం పెంపు
X

దిశ, కామారెడ్డి : ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం తెలిపారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సమయం పెంపు వల్ల ఉద్యోగులు,

వ్యాపారస్తులు, కార్మికులు, ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతంలో తక్కువగా ఓటింగ్ నమోదు, ప్రస్తుత వేసవి ఎండలు తదితర కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత వరకు ఉదయం వెళ్లే ఓటింగ్ వేసేలా చూడాలని కోరారు. వంద శాతం ఓటింగ్ నమోదు కావాలని అభిలషించారు.

పార దర్శకంగా పూర్తయిన ర్యాండమైజేషన్

అనుబంధ ర్యాండ మైజేషన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఈవీఎం గోదాములో ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ అయిన 791 ఈవీఎంలతో పాటు రిజర్వు లో ఉన్న 191 కలిపి మొత్తం 990 ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ ను పూర్తి చేశామన్నారు.

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున అదనపు బ్యాలట్ యూనిట్ల అవసరం ఉన్నందున అనుబంధ ర్యాండమైజేషన్ చేశామని కలెక్టర్ చెప్పారు. ఈ ఈవీఎంల మొదటి దశ పరిశీలన ( ఫస్ట్ లెవెల్ చెకింగ్ ) బుధవారం ఈసీఐఎల్ ఇంజనీర్లచే పూర్తి చేశామన్నారు. జుక్కల్ కు 319, ఎల్లారెడ్డికి 338, కామారెడ్డి కి 333 ఈవీఎంలను కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పర్యవేక్షకులు ఉమాలత తదితరులు పాల్గొన్నారు.

4, 5న హోమ్ ఓటింగ్

ఈ నెల 4,5 తేదీల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన 181 మంది వృద్దులు, 258 మంది వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు. ఇందుకోసం 25 ప్రత్యేక హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేసి 12 రూట్ల ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించ నున్నామని తెలిపారు. ఓటింగ్ గోప్యతను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, వీడియోగ్రఫీ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీలకు చేరవేశామని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ ఓటర్లు ఆయా తేదీలలో ఇంటివద్ద తప్పక ఉండి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశాలనైనా ఫిర్యాదు చేయవచ్చు

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ వాసులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశాలైన సాధారణ పరిశీలకుల దృష్టికి తేవచ్చని, ఫిర్యాదు కూడా చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి ఈనెల 4న కామారెడ్డి పట్టణంలోని

ఆర్అండ్బీ అతిధి గృహంలో సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు పరిశీలకులను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని, సందేహాలు నివృత్తి చేసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు కూడా అందించవచ్చన్నారు. నేరుగా కలవలేని వారు 7995692890 ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

Next Story

Most Viewed