క్యాబినెట్ రేసులోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే..

by Sumithra |
క్యాబినెట్ రేసులోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయని చర్చ కొనసాగుతూనే ఉంది.. జనవరిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ స్థానం త్రుటిలో తప్పిపోయింది. ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ టికెట్ పై నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిన సామాజిక సమీకరణ నేపథ్యంలో ఎవరికి పదవులు దక్కలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీమంత్రి సీనియర్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేయడంతో పాటు టికెట్ ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని హమీలు ఇచ్చింది. రాష్ట్ర క్యాబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ అధినాయకత్వం తెరతీసింది.

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సమయంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో గెలిచిన వారిలో ముగ్గురు ఓసీలు కాగా ఒకరు ఎస్సీ కావడంతో నిజామాబాద్ జిల్లాకు మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదు. ఇటీవల రెండో విడత మంత్రి పదవుల పంపకాలు ఉంటాయని జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించడానికి పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ఐతే మంత్రివర్గం పై తనకు ఆశ లేదని తన వారసుడి రాజకీయ భవిష్యత్తు, బాన్సువాడ నియోజకవర్గం డెవలప్మెంట్ లక్ష్యం అని పోచారం ప్రకటించడంతో జిల్లాలో మంత్రి వర్గ విస్థరణలో సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ లు మాత్రమే మిగిలారు.

ఈ సారి కుడా సామాజిక వర్గాల ప్రకారం మంత్రి వర్గ విస్తరణ అని చెబుతుండగా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు బీసీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రిపదవి దక్కుతుంది తొలిత ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ జిల్లాకు ఒక్కటే మంత్రి పదవి దక్కుతుందని దానితో మంత్రి పదవిని ఇచ్చేందుకుగాను ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నిర్ణయం జరిగినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ రెండోసారి చర్చకు రావడంతో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రిపదవి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంగీకరించినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇదే అంశం ఇప్పుడు వారికి ప్రతిబంధకంగా మారిందన్న చర్చ మొదలయింది. సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు ఉన్నాయన్న అంశంతోనే మొదటి విడతలో పదవి మిస్ అయిందని చెప్పాలి.

రెండో విడతలో ఖచ్చితంగా నాలుగు క్యాబినెట్ పదవులు భర్తీ చేస్తారని చెబుతుండగా అందులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనడంతో సుదర్శన్ రెడ్డికి ఖాయమని చెబుతున్న పోర్టు పోలియో మాత్రం ఏమిటనేది సస్పెన్షన్ గా మారింది. కామారెడ్డి జిల్లా నుంచి పోటీ పడుతున్న మధన్ మోహన్ గత కొంత కాలంగా ఢిల్లీకి పరిమితమయ్యారు. ఎఐసీసీలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని గంటాపదంగా చెబుతున్నారు. మొదటి విడతలో జరిగిన మంత్రివర్గ కూర్పులో భాగంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లికి మాత్రమే అవకాశం దక్కింది. రెండో విడతలో ఆ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుండగా కామారెడ్డికి చెందిన మధన్ మోహన్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా తమకే మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. ఎవరికి వారు రాష్ట్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండగా మధన్ మోహన్ ఢిల్లీ పెద్దలను కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయంలో ఈ నెల మొదటి వారంలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ సామాజిక సమీకరణలు ఆలస్యం కారణంగానే క్యాబినెట్ పదవుల పంపకాలు విస్తరణకు బ్రేక్ పడిందని చర్చ ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది.

Next Story

Most Viewed