ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి

by Sridhar Babu |
ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నోడల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనల పై తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారులతో సమీక్షించారు. పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం మనమంతా

భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. గోడలపై ఉన్న రాజకీయ పార్టీల వాల్ పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, క్యాలెండర్లు తక్షణమే తొలగించాలని తెలిపారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కప్పి ఉంచాలని కోరారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించడం,

రిపోర్ట్ చేయడం, ఆధారాలు సేకరించడం, రికార్డు చేయడం చాలా కీలకమని, సి-విజల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని అన్నారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు రాజారాం, బావయ్య, మురళీకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, రఘునాథ్, ఏవో మసూర్ అహ్మద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story