shopping complexes : వసతి గృహ విద్యార్థుల సమస్యలు పట్టవా ?

by Sumithra |
shopping complexes : వసతి గృహ విద్యార్థుల సమస్యలు పట్టవా ?
X

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బాలుర వసతి గృహం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు వసతి గృహం చుట్టూ వెంటిలేషన్ రాకుండా దుకాణపు సముదాయాలు వెలిశాయి. అప్పుడున్న రాజకీయ నాయకుల అండదండలతో గ్రామపంచాయతీ అధికారులు వారికి తలొగ్గి దుకాణ సముదాయాలకు అనుమతులు ఇచ్చారు. అప్పుడు వాటిని తొలగించాలని అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసినప్పటికీ నాయకుల అండదండలతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది తమ సమస్యలను తీరుస్తారేమో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

గతంలో వసతి గృహాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన స్పెషల్ అధికారుల దృష్టికి తీసుకు పోయినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహం చుట్టూ ఏర్పడిన సముదాయాల వల్ల వెంటిలేషన్ లేక సూర్యకిరణాలు లోపలికి పడకపోవడంతో క్రిమికీటకాలు చేరుతూ అనారోగ్య బారిన పడుతున్నట్లు వారు తెలిపారు. వర్షం పడితే దుకాణాల సముదాయం వెంబడి నీరు నిలిచి నీటి తెమ్మెలు గోడలకు వస్తున్నాయని వారు ఆరోపించారు. గ్రామపంచాయతీ అధికారులు వీటిని తొలగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నెలసరి వచ్చే ఆదాయం వైపు మొగ్గు చూపుతూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు సైతం మండలంలో వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను తొలగిస్తారని మండల ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed