'రైతు సహకార సంఘాలను బలోపేతం చేస్తా..'

by Sumithra |
రైతు సహకార సంఘాలను బలోపేతం చేస్తా..
X

దిశ, గీసుగొండ : రైతు సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ సహకార సంఘం 40వ మహాజనసభ సంఘం అధ్యక్షుడు బొమ్మాల రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం సభ్యులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు ఇతర బ్యాంకులలో రైతులకు 7 శాతం వడ్డీకి పంట రుణాలు ఇస్తుంటే, సహకార సంఘాల్లో మాత్రం అందుకు భిన్నంగా 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని, ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకార సంఘంలోని రైతులకు తక్కువ వడ్డీకి పంట రుణాలు ఇచ్చేలా చేయాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం కన్వీనర్ సోమిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యంతో సంఘంలోని కొంతమంది రైతులకు అందకుండా పోయిందని, వారికి రుణమాఫీ ఎందుకు రాలేదని సంఘం సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, రుణమాఫీ అందని రైతులకి రుణమాఫీ అందేలా చేయాలని డిమాండ్ చేశారు.

ఎంసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె కుమారస్వామి ఊకల్ సొసైటీలో గతంలో జిన్నింగ్ మిల్లు నడిపారని అప్పుడు గింజలు బాపతు సుమారు 57 లక్షలు గణేష్ ఆయిల్ మిల్లు నాగపూర్, లక్ష్మీ విష్ణు టెక్స్టైల్ సోలాపూర్, స్పిన్ఫేడ్ హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండగా, సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వారు చెల్లించడం లేదని వారిపై తగు చర్యలు తీసుకొని, ఆ డబ్బులను రాబట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి డీసీఒతో కలిసి సహకార సంఘాలలో సిబ్బందితో, రైతులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పక్షం రోజుల తర్వాత ప్రప్రధమంగా ఊకల్ సహకార సంఘంలో సమీక్ష సమావేశం నిర్వహించి సంఘం సభ్యుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని అన్నారు.

రైతు రుణమాఫీ అందని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, సహకార సంఘాల నోడల్ అధికారి కీరు నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ మున్నంగి జనార్దన్ రెడ్డి, డైరెక్టర్లు మండల వీరస్వామి, మేకల రాజు, ఇంజం వెంకట్రావు, భూక్య నిమ్మ, ఆవుల రజిత, బొమ్మాల లక్ష్మి,చెవ్వ పాపయ్య, దాసరి రవి, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.రామకృష్ణ రావు,సంఘ సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

అసంపూర్తిగా మహాజనసభ..

ఊకల్ సహకార సంఘం 40వ మహాజన సభ అసంపూర్తిగా జరిగిందని ఎంసీపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె కుమార్ స్వామి అన్నారు. మహాజనసభలో ఏ ఒక్క నిర్ణయం కూడా చర్చకు రాలేదని సంఘ సభ్యులు ఏ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలపలేదని, సంఘం పాలకవర్గం, సిబ్బంది సభను సజావుగా నడపలేక పోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed