మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో అవినీతి పరులకు అవకాశం ఇవ్వద్దు : కాటిపల్లి వెంకట రమణా రెడ్డి

by Aamani |
మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో అవినీతి పరులకు అవకాశం ఇవ్వద్దు : కాటిపల్లి వెంకట రమణా రెడ్డి
X

దిశ,కామారెడ్డి : మీ పైన నమ్మకంతో గెలిపించిన మీ వార్డు ప్రజల అభిప్రాయం మేరకు మాత్రమే పని చేయండి ఎవరో అవినీతిపరుల కోసం వద్దు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం నెగ్గిన వెంటనే ప్రభుత్వ పెద్దమనిషి ఇక కామారెడ్డి మున్సిపల్ అవినీతి అంతం అయ్యిందని భవిష్యత్లో కామారెడ్డి ప్రాంత ప్రజలకు నీతివంతమైన పాలన అందించడం జరుగుతుందని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. అవినీతి అంతం అంటే చెట్టు కొమ్మలు తొలగించడం కాదు అని వేర్లతో సహా అన్నదమ్ములను తొలగిస్తేనే కామారెడ్డి అవినీతి అంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ ను కొన్నేళ్ళుగా కొందరు తమ ఆధీనంలో ఉంచుకొని విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు వారు చెప్పిన వ్యక్తులకు మున్సిపల్ చైర్పర్సన్ సీటు అప్పజెప్పవద్దని కామారెడ్డి మున్సిపల్ లో 50 శాతం మహిళా కౌన్సిలర్లు ఉన్నారని వారిలో నీతిమంతులైన వారికి మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ అవకాశం కల్పించాలని కౌన్సిలర్లను కొరారు.

మీరు పార్టీలు మారడం మీ వ్యక్తిగత విషయం అని కానీ మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మీ వార్డు ప్రజలను మాత్రం మోసం చేయవద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపుకు వెళ్ళితే స్వయంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబోద్దిన్, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్లు తమ పార్టీలోని 10 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని సూచించిన విషయం వెనుక అంతరార్థం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో తాను చూసిన వివిధ ప్రాంతాల్లోని మున్సిపల్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉండి కూడా వెనుకబడి ఉన్న ప్రాంతం మన కామారెడ్డి మున్సిపల్ అని గుర్తు చేశారు. మళ్ళీ మున్సిపల్ పీఠం కోసం సర్వే నెం 6 కబ్జా చేసిన వారు, శ్రీవారి వెంచర్, మాస్టర్ ప్లాన్ రూపకర్తలు ఒక్కటవుతున్నారని వీరందరు కలిసి మళ్ళీ కామారెడ్డి మున్సిపల్ ను దోచుకోవడానికే ఈ అవిశ్వాస మంత్రం పటిస్తున్నారని పేర్కొన్నారు.

అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కామారెడ్డి ఆదాయం రూ.11 కోట్లు ఉంటే ఖర్చురూ. 17 కోట్ల రుపాయలు ఉందని మరో 70 కోట్ల అప్పుల్లో మున్సిపల్ ఉందని పేర్కొన్నారు. కామారెడ్డిలో బడే మియా, చోటే మియా అంటు వారు పేర్లు చెప్పుకుని బడబాబులు టాక్సులు ఎగ్గొడుతున్నారని సుమారు 2 వేలకు పైగా ఇండ్లను ఇంటి నంబర్లు లేవని కమర్షియల్ ట్యాక్సులు చాలా వరకు ఎగ్గొడుతున్నారని పేర్కొన్నారు. ఎవ్వరు అవినీతి అక్రమాలకు పాల్పడిన సహించేది లేదని గతంలో ఎక్కడ తమకు అన్యాయం జరిగినా ఎమ్మెల్యే కాంపుకు వచ్చేవారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ అన్యాయం జరిగితే నేనే స్వయంగా అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ లో అక్రమాలకు పాల్పడాలనుకునే కొందరి కలలను కలలుగా ఉంటాయని ప్రతి ఒక్కరి కబ్జాలు త్వరలో బయటకు తీస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story