Additional Collector : భవిష్యత్ తరాల కోసమే వనమహోత్సవం..

by Sumithra |
Additional Collector : భవిష్యత్ తరాల కోసమే వనమహోత్సవం..
X

దిశ, ఆర్మూర్ : మన ముందు తరాల బాగు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు.. వనమహోత్సవం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి అడవుల విస్తీర్ణాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని లోకల్ బాడీస్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించి ప్రభుత్వ లక్ష్యం మేరకు అడవుల విస్తీర్ణం పెరిగేలా కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షించి పరిశీలించారు. తరువాత మండల అధికారులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తోటే పని అయిపోయిందని అనుకోవద్దని, నాటిన మొక్కలను బాధ్యతాయుతంగా పర్యవేక్షించి సంరక్షించి చెట్లుగా ఎదిగేలా చేయాలన్నారు. రోడ్ల వెంబడి మొక్కలు నాటే సమయంలో అధికారులు విద్యుత్ వైర్ల కింద భారీగా పెరిగే వృక్షాలను నాటకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల కింద భారీ స్థాయిలో పెరిగే మొక్కలు నాటితే త్వరలోనే మళ్లీ చెట్లను నరికేయాల్సి వస్తుందన్నారు. మొక్కలు నాటడం, నరకడం వల్ల ఉపయోగమేముండదని, ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుందని, అధికారులు ఈ విషయాన్ని ఆలోచించి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, ఆర్మూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీ ఓ శ్రీనివాస్, ఉపాధిహామీ ఏపీవో సురేష్, పంచాయతీరాజ్ ఏఈ నితిన్, అంకాపూర్ పంచాయతీ కార్యదర్శి హారిక నవీన్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed