దిశ ఎఫెక్ట్…భిక్షాటన పిల్లల కోసం ఉరుకులు.. పరుగులు

by Kalyani |
దిశ ఎఫెక్ట్…భిక్షాటన పిల్లల కోసం ఉరుకులు.. పరుగులు
X

దిశ, కామారెడ్డి : "భిక్షాటనలో బాల్యం బందీ" అనే శీర్షికతో "దిశ" పత్రికలో వచ్చిన కథనం జిల్లా కేంద్రంలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చదువుకు దూరమై బెగ్గింగ్ చేస్తున్న ముక్కుపచ్చలారని ఆడపిల్లల పరిస్థితిని దిశ పత్రికలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఉదయమే దిశ ప్రతినిధికి ఫోన్ చేసిన అధికారులు బాధిత పిల్లలు భిక్షాటన చేసే ప్రాంతాలు, వారి ఫోటోలను ఇవ్వాల్సిందిగా కోరారు.

దిశ ప్రతినిధి పంపిన ఫోటోలలో ఉన్న నలుగురు చిన్నారులలో ఇద్దరిని అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, పాతబస్టాండ్ రైల్వే స్టేషన్, డెయిలి మార్కెట్లో అధికారులు జల్లెడ పట్టారు. మధ్యాహ్నం నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఇద్దరు చిన్నారులను అధికారులు పట్టుకున్నారు. వారిని బాలసధన్ కు తరలించారు. మిగతా పిల్లల కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టినా లభించలేదు. మంగళవారం కూడా తనిఖీలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

భిక్షాటన చేపిస్తే కేసులు : స్రవంతి.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిణి

జిల్లాలో ఎక్కడైనా చిన్న పిల్లలతో భిక్షాటన చేపిస్తే బాధ్యులైన తల్లిదండ్రులు, సంబంధికులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి వారం తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ఈ నెలలో దాదాపు 8 మంది భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి బాలసధన్ కు తరలించామని తెలిపారు. అలాగే చైల్డ్ లేబర్ ను కూడా గుర్తించామని పేర్కొన్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు సోమ, గురువారల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడతామని తెలిపారు. గతంలో భిక్షాటన చేసే పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు తెలిపారు.

Next Story