20 రోజుల ప్రచారానికి తెర.. గెలుపు అంచనాలలో అభ్యర్థుల బిజీ

by Mahesh |
20 రోజుల ప్రచారానికి తెర.. గెలుపు అంచనాలలో అభ్యర్థుల బిజీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగిసింది. గత నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా నామినేషన్ల ప్రక్రియ తర్వాత ప్రచారం జోరుగా సాగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. దీంతో బైకులు బంద్ అయ్యాయి. సోమవారం పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు లోకి వచ్చింది. మద్యం, కల్లు విక్రయాలు బంద్ చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు పార్టీల అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాలోని ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రోజు ప్రచారం చేశారు. బీజేపీ ముందస్తుగానే విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించింది. జిల్లాలో చివరి రోజు పెద్ద లీడర్లు ఎవరు ప్రచారం చేయలేదు. క్యాండెట్లు మాత్రం రోడ్ షోలు, ప్రచారాన్ని నిర్వహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులు చాలా మట్టుకు చివరి రోజు కీలక సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు.

కొందరు పార్టీల తరపున గెలుపు కోసం తాయిలాల పంపిణీకి సిద్దమయ్యారు. శనివారం రాత్రి నుంచి ప్రలోభాల పర్వం గట్టిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం రహాస్య ప్రాంతాల్లో డంప్ చేయగా కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమా లో ఉన్నారు. ముక్కోణపు పోటీ ఉండగా ఎవరికి వారే తామే మెజార్టీతో గెలుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే చేయించుకున్న సర్వేలు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగే ఎలక్షన్ కోసం బూత్ స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఓటింగ్ శాతాన్ని పెంచి దానిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటరు కార్డు లేకపోయినా, ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర 12 రకాల గుర్తింపు కార్డు లో ఏదైనా ఒకదానిని వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని సూచించారు. ఈ నెల 13 వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, వాస్తవానికి ప్రతీసారి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ గడువు ముగిసేదని, ఈసారి దానిని మరో గంట పాటు పొడిగించడం జరిగిందన్నారు. నిర్ణీత సమయం‌లోపు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సైతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు.

ఓటర్లకు 98.47 శాతం మేరకు ఓటరు సమాచార స్లిప్పులను బీ.ఎల్.ఓల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారని చెప్పారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ కు 72 గంటల ముందు నుంచి నిఘాను ముమ్మరం చేయించామని, నిఘా బృందాల సంఖ్యను రెట్టింపు చేసి విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) గా పరిగణించబడే పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలు నిషేధమని, రాజకీయ ప్రకటనలు ప్రచురించదల్చిన వారు కూడా ముందస్తుగా ఎం.సీ.ఎం.సీ ద్వారా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు నీడ అందించేలా టెంట్లు, టాయిలెట్, ర్యాంపు, వీల్ చైర్, తాగు నీరు, ఫ్యాన్, అవకాశం ఉన్న చోట కూలర్ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల నిఘా నీడలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు.

అంతేకాకుండా, 302 మంది సూక్ష్మ పరిశీలకులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సేవలందిస్తారని తెలిపారు. కాగా, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 1704867 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఎలక్షన్ కమిషన్ 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యంగ ఓటర్లకు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించిందని, ఈ మేరకు జిల్లాలో 1772 మంది తమతమ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. మరో 28 మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఓటింగ్ ప్రక్రియకు ముందే వివిధ కారణాలతో మృతి చెందారని తెలిపారు. పోటీలో 29 మంది అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ కోసం రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య కంటే 25 శాతం అదనంగా లెక్కిస్తూ (రిజర్వు) బ్యాలెట్ యూనిట్లు 4497, కంట్రోల్ యూనిట్లను 2293 కేటాయించడం జరిగిందని, వి.వి.ప్యాట్లు 40 శాతం అదనంగా కలుపుకుని 2511 కేటాయించామని అన్నారు. ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా, ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు వీలుగా 206 సెక్టార్లను ఏర్పాటు చేస్తూ, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలను నియమించామని, ఎన్నికలు ముగిసేంత వరకు అనుక్షణం ఈ బృందాలు నిఘా ఉంచుతాయని అన్నారు. సైలెన్స్ పీరియడ్ కు సంబంధించిన నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు.

రూ.3.5 కోట్ల నగదు సీజ్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కు సంబంధించి 9 కేసులు నమోదు చేశామని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా నిజామాబాద్ జిల్లా పరిధిలో 3000 పైచిలుకు మందికి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందుతున్న ట్రైనీ సిబ్బందితో పాటు 7 కంపెనీల కేంద్ర బలగాలు, ఐదు కంపెనీల టీఎస్ ఎస్పీ బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయన్నారు. నలుగురు అదనపు డీసీపీలు, 19 మంది ఏసీపీలు, 38 సీఐలు, 64 మంది ఎస్.ఐలు, ఇతర సిబ్బంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని వివరించారు. ఎన్నికల నియమావళి అమలు పక్కాగా పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రూ. 3.05 కోట్ల నగదు, రూ.24.64లక్షల విలువ చేసే మద్యం, రూ. 3.65 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి, రూ.29 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.

126 లైసెన్స్ కలిగిన తుపాకులు ఉండగా, వాటిలో 91 తుపాకులను డిపాజిట్ చేశారని, మిగితావి బ్యాంకుల భద్రతా సిబ్బందికి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. కాగా, పోలింగ్ ను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని, శనివారం సాయంత్రం 6 గంటల అనంతరం బహిరంగ ప్రచారం నిషేధమని స్పష్టం చేశారు. బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లు, రికార్డెడ్ వాయిస్ లు పంపడం, బాణాసంచా కాల్చడం నిషేధమని, స్థానికేతరులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లు మినహా ఇతరులెవరూ లోనికి వెళ్లకూడదని, అభ్యర్థులు, ఏజెంట్లు కూడా నిబంధనలను పాటించాలని, సెల్ ఫోన్లు లోనికి అనుమతించబడవని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed