పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంటలు.. అలుగు దుంకుతున్న సింగడి చెరువు

by Anjali |
పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంటలు.. అలుగు దుంకుతున్న సింగడి చెరువు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భారీ కుండపోత వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాను ఆగమాగం చేస్తున్నాయి. ఊరు ఏరు ఏకం కాగా ఉమాది జిల్లాలో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వేల్పూర్ మండలం వేల్పూర్ రామన్నపేట మధ్యలో రోడ్డు వరద కారణంగా కుంగి పోవడంతో ఆ రోడ్డుపై రాకపోకలు ఆగిపోయాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో, పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. పిల్ల కాలువలు రోడ్లను ముంచెత్తి ప్రవహిస్తుండగా, వాగులన్ని జలకలను సంతరించుకున్నాయి. శనివారం సాయంత్రం మొదలైన వర్షం అలుపనేది లేకుండా కురుస్తూనే ఉంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 254.2 మిమీల భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో 172.1 మిమీల అత్యధిక వర్షపాతం నమోదయింది. ఎక్కువ భాగం నుండి పోటెత్తుతున్న వరద కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుకుంది. వాటర్ లెవెల్ 1088.9 అడుగులకు చేరుకోగా, 73 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఉప్పెనలా ముంచెత్తుతున్న వరద కారణంగా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సోమవారం మధ్యాహ్నం 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. క్యూసెక్కుల నీరు ఎగువ నుండి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,51,250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెరిచిన గేట్ల ద్వారా 2,65,853 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా 51,200 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 9.524 టీఎంసీలకు చేరుకుంది. అలీ సాగర్ గేట్లను కూడా ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదిలారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు లోకి కూడా కొద్దికొద్దిగా ఇన్ ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి 1,342 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి కలుస్తోంది. సింగీతం ప్రాజెక్టు గేట్లను కూడా అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకింది. ప్రాజెక్టు ఎగువ నుండి 10,295 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. అలుగు నుండి దిగువకు భారీగా నీరు ప్రవహిస్తోంది.

శిధిలావస్థలో ఉన్న ఇళ్లకు నోటీసులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాత ఇళ్లు కూలుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. నిజామాబాద్ నగరంలో పెద్ద బజార్ లోని హనుమాన్ ఆలయం సమీపంలో ఓ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశత్తూ ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని కారణంగా ప్రాణ నష్టం, పెద్ద ప్రమాదం తప్పింది. నగరంలో కూలిపోయే స్థితిలో ఉన్న 35 ఇళ్లకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు. నగరంలోని దాదాపు అన్ని డివిజన్లలో కూలిపోయే దశలో ఉన్న పాత ఇళ్లను గుర్తించే పనిలో అధికారులున్నట్లు తెలుస్తోంది.

నగరంలోని దుబ్బా, గాజుల్ పే, అరుంధతినగర్, ముదిరాజ్ గాల్లీ బోర్గాం (పి) లలో కూడా కొన్ని ఇళ్లు కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయి.నవీపేట్ మండలం ఉమ్మడి గ్రామంలోని ఉమామహేశ్వరుని ఆలయం గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగింది. శివాలయం గంగమ్మ ఒడిలో తలదాచుకుంది. ప్రతి వర్షాకాలం సీజన్ లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ ఆలయం నీట మునిగిపోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆర్మూర్ మండలం ఇస్సపెల్లి - రాంపూర్ గ్రామాల మధ్య రెండు భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. తరువాత కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి చొరవతో చెట్లను తొలగించడంతో రోడ్డుపై రాకపోకలు కొనసాగాయి.

సింగడి చెరువు అలుగుపై నుండి నీరు దూకుతోంది. మంగళవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవును ప్రకటించిన అధికారులు, వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మంగళవారం కూడా సెలవును ప్రకటించారు. పాత భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల విషయంలో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల పైకప్పులు లీకేజీల కారణంగా గోడలు తడిచి ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా పలు పాఠశాలలు ఉన్నాయి. తడిసిన గోడలకు కరెంట్ షాక్ తగిలి పలుమార్లు విద్యార్థులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed