రాజీపద్ధతే న్యాయసేవ సంస్థ ప్రధాన లక్ష్యం

by Sridhar Babu |
రాజీపద్ధతే న్యాయసేవ సంస్థ ప్రధాన లక్ష్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సివిల్ దావాలను, రాజీపడదగిన క్రిమినల్ కేసులను న్యాయార్థుల అభిమతం మేరకు రాజీపద్దతిన పరిష్కరించబడిమే న్యాయసేవ సంస్థ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల జ్యోతి

ప్రజ్వలన చేసి కక్షిదారులనుద్దేశించి ప్రసంగించారు. చట్ట పరిజ్ఞానం జనసామాన్యంకు మరింత చేరువ కావలసిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు. ఒక న్యాయపరమైన వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఒకపక్షం రాజీకోసం ప్రయత్నిస్తే మారోపక్షాన్ని ఆ దిశగా కదిలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. న్యాయసేవల చట్టం ద్వారా ఏర్పరిచిన లోక్ అదాలత్ లను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. సైబర్ నేరాలలో డబ్బును కోల్పోయిన బాధితులకు త్వరితగతిన తిరిగి వారి డబ్బులు ఇప్పించడానికి కోర్టులు తమ పరిధిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా న్యాయపీఠాలలో ప్రజాహితమే ఇమిడి ఉన్నదని జిల్లా జడ్జి తెలిపారు.

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ ప్రసంగిస్తూ లోక్ అదాలత్ ల విజయవంతానికి పోలీసుశాఖ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. న్యాయసేవలను, పోలీసు సేవలను పరిపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. వ్యక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు, కక్షలు తద్వారా జరిగే నేరాలు వ్యవస్థకు చేటు తెస్తాయని తెలిపారు. నేర రహిత సమాజానికి, శాంతియుత సహ జీవనానికి పౌర సమాజ తోడ్పాటు చాలా అవసరమని ఆయన అన్నారు. తెలిసీతెలియక చేసిన చిన్న చిన్న నేరాలకు కోర్టులలో జారిమానా చెల్లించడంతో సరిపోతుందని, కానీ అంతకు మించిన నేరాలు రుజువైతే జైలే గతని తెలిపారు.

అయినా చట్టం సమాజ విశాల ప్రయోజనాల కోసం, వ్యక్తుల మధ్య సఖ్యత కోసం, కొన్ని విషయాలలో మినహాయింపులు ఇచ్చి రాజీపడదగిన క్రిమినల్ నేరాలలో ఇరుపక్షాల ఆమోదం మేరకు రాజీపద్దతిన కేసుల పరిష్కరానికి అనుమతులు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ ,న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి కుష్బూ ,గోపికృష్ణ, శ్రీనివాస్ రావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్, నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకట రెడ్డి, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, న్యాయవాదులు మానిక్ రాజు, రవి ప్రసాద్, అంకిత, రజిత, కృష్ణ గోపాల్ రావు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ అవార్డులు, బ్యాంకు చెక్కుల ఆందజేత

లోక్ అదాలత్ లో సివిల్ కేసులలో రాజీపద్దతిన పరిష్కరించుకున్న కక్షిదారులకు లోక్ అదాలత్ అవార్డులు జిల్లా జడ్జి సునీత, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అందజేశారు. మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలలో బాధితులకు బ్యాంకు చెక్కులను అందించారు.

Advertisement

Next Story