మంత్రి తుమ్మల ఎంట్రీతో తొలి వికెట్ అవుట్.. సింహాచలానికి చిక్కులు తప్పవా..?

by Nagaya |   ( Updated:2024-01-20 08:41:26.0  )
మంత్రి తుమ్మల ఎంట్రీతో తొలి వికెట్ అవుట్.. సింహాచలానికి చిక్కులు తప్పవా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ అధికారిగా పని చేసి బదిలీపై వెళ్లిన సింహాచలంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో ఆరున్నర సంవత్సరాలుగా పనిచేసిన బీసీఓ సింహాచలం పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పలు సొసైటీలలో జరిగిన అవినీతి అక్రమాలకు బీసీఓ సింహాచలమే కారకూడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, జిల్లా ఇంచార్జ్ మంత్రికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పటి మంత్రి డీసీఓ సింహాచలంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రికి సన్నిహితంగాఉండడంతో పాటు జిల్లా కలెక్టర్‌ను సైతం మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది రైతు సంఘాల నాయకులు డీసీఓ సింహాచలంపై ఆధారాలతో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల.. డీజీఓ సింహాచలంపై విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన రోజే సింహాచలంకు బదిలీ ఆదేశాలు రావడం విశేషం. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కొత్త డీసీఒగా బాధ్యతలు చేపట్టారు. అయితే నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో పోతంగల్, ఎత్తొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లి, హోన్నాజిపేట్, డిచ్ పల్లితో పాటు సాక్షాత్తు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని బాల్కొండ, తాళ్లరాంపూర్, భీంగల్‌తోపాటు మరో రెండు సొసైటీలలో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి.

జిల్లాలో తొలి వికెట్ ఆయనే..

నిజామాబాద్ జిల్లాలో పని చేసిన జిల్లా అధికారిపై తొలి వికెట్ పడింది. జిల్లా నుంచి డీసీఓ సింహాచలంలో బదిలీవేటు వేశారు. అయితే ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సింహాచలంపై విచారణ పూర్తయ్యేంత వరకు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారని సమాచారం. ఇప్పటికైనా జిల్లా సొసైటీలో జరిగిన అవినీతిలో ఎంత మంది అక్రమార్కులు బయటకు వస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story