చిన్నారి విక్రయం.. వైద్యుల అరెస్ట్

by Kalyani |
చిన్నారి విక్రయం.. వైద్యుల అరెస్ట్
X

దిశ, కామారెడ్డి : ఫిబ్రవరిలో ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. రెండు నెలలకు 8 నెలల గర్భవతి కావడంతో భర్తకు తెలియకుండా ఉండేందుకు నానా ప్రయత్నాలు చేసింది. చివరకు తనకు బిడ్డ వద్దని, ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలని ఓ ఆసుపత్రి వైద్యులతో 2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. డెలివరీ విషయం తెలుసుకున్న భర్త తనకు పెళ్లయి రెండు నెలలే అయితే 8 నెలల గర్భం ఎలా అని విచారిస్తే పెళ్ళికిముందే ఈ తతంగం నడిచినట్టు గుర్తించాడు. పైగా పుట్టిన పసికందును మరొకరికి అమ్మేసిన విషయం తెలుసుకున్న భర్త 1098 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్న ప్రభుత్వ వైద్యుని సహకారంతో జరిగిన ఈ తతంగం వివరాలను కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు.

సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ తో వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమె గర్భవతి. భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఏప్రిల్ 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సమన్విత ఆస్పత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్న ఉదయ్ కిరణ్ ను లావణ్య సంప్రదించింది. దాంతో ఆస్పత్రి వైద్యులైన తండ్రి కొడుకులు డాక్టర్ ఇట్టం నడిపి సిద్దిరాములు, డాక్టర్ ఇట్టం ప్రవీణ్ కుమార్ ను కలిసి తన గర్భం తీసేయ్యాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11న రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు.

పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ బిడ్డ తనకు వద్దని లావణ్య చెప్పడంతో డాక్టర్ సిద్దిరాములు తన పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్ కు ఆడపిల్ల ఉందని, ఎవరికైనా కావాలంటే చెప్పాలని తెలపగా బాలకిషన్ కు బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యకు చెప్పాడు. దేవయ్య ద్వారా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతికి పిల్లలు లేరని 20 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకున్న ప్రకారం ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్ కు ఫోన్ పే ద్వారా రూ. 80,000 చెల్లించారు. అయితే పాపకు చికిత్స చేయించిన ఆస్పత్రిలో లావణ్య భర్త మహేష్ కు తెలిసిన వారు ఉండటంతో మీ భార్య డెలివరీ అయిందట.. పాప మా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పడంతో పెళ్ళైన 2 నెలలకు డెలివరీ కావడం ఏంటని వివరాలు తెలుసుకోగా అసలు విషయం బయటపడింది.

దీంతో 1098 నంబరుకు మహేష్ ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి పాప విక్రయానికి సంబంధించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో పాప విక్రయం గుట్టు రట్టైంది. గతంలో డాక్టర్ ఇట్టం సిద్దిరాములు కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహించే వారని, ఆ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడంతో పాటు ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విచారణలో భాగంగా సమన్విత ఆస్పత్రికి వెళ్లగా ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్ చేస్తారని తేలిందన్నారు. ఆస్పత్రిలో చేరే డెలివరీ పేషంట్లకు సంబంధించిన వివరాలు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆస్పత్రిలో నమోదు చేయడం లేదన్నారు.

ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆస్పత్రికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలతో పాటు ఆస్పత్రిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తాము నివేదిక ఇస్తామని తెలిపారు. విక్రయించిన పాపను భూపతి నుంచి రిస్క్ చేసి తీసుకువచ్చామని, పాపను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించామని సీఐ తెలిపారు. ఈ ఆస్పత్రి ద్వారా ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమకు తెలపాలని సీఐ తెలిపారు. చిన్నారి విక్రయానికి సంబంధించిన కేసులో ఆస్పత్రి వైద్యులు ఇట్టం సిద్దిరాములు, ఆయన కుమారుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్ మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, పాపను కొనుగోలు చేసిన భూపతిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారని సీఐ పేర్కొన్నారు.

Next Story