కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి

by Sridhar Babu |
కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి
X

దిశ, భీంగల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం వేల్పూర్ మండలం లక్కోరా హైస్కూల్ ఆవరణలో ముందుగా చదువుల తల్లి సరస్వతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వాహనాలను, 7 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు జిల్లాలోని 530 గ్రామపంచాయతీ పరిధిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను అధికారులు నిర్వహిస్తారన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల పై ప్రజలను చైతన్య పరిచేలా ఈ ప్రత్యేక బృందాలు రోజుకు రెండు, మూడు గ్రామ పంచాయతీలల్లో కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 50 రోజుల పాటు నిర్వహించేందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ 17 రకాల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చందర్ నాయక్, డీపీఓ జయసుధ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు, డీఈఓ దుర్గాప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డీఐఈఓ రఘురాజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, నాబార్డు డీడీఎం ప్రవీణ్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ రాకేష్, డీఎల్పీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున, సర్పంచ్ వంశీకృష్ణ, ఎంపీటీసీ గంగామణి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story