అభివృద్ధికి కేరఫ్ అడ్రస్ బాన్సువాడ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Shiva |
అభివృద్ధికి కేరఫ్ అడ్రస్ బాన్సువాడ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, బాన్సువాడ : రాష్టంలో అభివృద్ధికి కేరఫ్ అడ్రస్ బాన్సువాడ నియోజకవర్గమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రూ.7.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్‌, సైడ్ డ్రైనేజీతో నూతనంగా నిర్మించే ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా రూ.1.10 కోట్లతో బీర్కూర్ నుంచి మల్లాపూర్ క్యాంపు మీదుగా టీ.టీ.డీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు వేయనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో నిర్మించే మున్నూరు కాపు సంఘం ప్రహారీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీర్కూర్ మున్నూరు కాపు సంఘం భవనంలో జరిగిన సభలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం కలుగుతోందని అన్నారు. వ్యాపార అవకాశాలు పెరిగి అభివృద్ధి జరుగుతుందన్నారు.

వాహనాలు పెరగడంతో రహదారులను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నాలుగు లైన్ల రహదారి, డివైడర్‌, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైయిన్ తో నిర్మిస్తున్నామని ఇప్పటికే బాన్సువాడ, వర్ని, మోస్రా, చందూరులలో పూర్తి చేశామన్నారు. ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని విస్తరించి నూతనంగా వేయడానికి నిధులు మంజూరు చేయాలని నేను గతంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి వినతిపత్రం అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణానికి కోసం రూ.500 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

మెదక్-రుద్రూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రుద్రూరు, నస్రుల్లాబాద్ మండల కేంద్రాల్లో కూడా ఫోర్ లైన్ నిర్మాణం అవుతోందన్నారు. అదేవిధంగా మద్నూర్ నుంచి పోతంగల్ మీదుగా బోధన్ వరకు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 470 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతోనే బాన్సువాడ నియోజకవర్గానికి కావలసిన నిధులు వస్తున్నాయని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, వైస్ ఎంపీపీ కాశీరాం, నాయకులు అవారి గంగారాం, ద్రోణవల్లి అశోక్, మియాపురం శశికాంత్, దుంపల రాజు, కోరిమె రఘు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story