నిజాంపేట్ బీఆర్ఎస్ లో క్యాడర్ అయోమయం

by Kalyani |
నిజాంపేట్ బీఆర్ఎస్ లో క్యాడర్ అయోమయం
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయోమయంలో ఉన్నారు. ఇంతకీ తమ పార్టీ లైన్ ఏదో అంటూ తెలియక తికమక పడుతున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఏ పంథా లో రాజకీయం నడుస్తుందో... ఎవ్వరికి జై కొట్టాలో... ఎవ్వరికి ఛీ కొట్టాలో తెలియని అమాయక పరిస్థితి నెలకొంది. సాధారణంగా రాజకీయ ధర్మం ప్రకారం ఒక పార్టీ విధానాలు, ఒక పార్టీ కార్యక్రమాలు మరొక పార్టీకీ అంతగా నచ్చవు. ఒక పార్టీ లైన్ ఒకటైతే మరో పార్టీ లైన్ మరోలా ఉంటుంది. కానీ ఇక్కడ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కార్యక్రమాలను బీఆర్ఎస్ నేతలు సక్సెస్ చేయడం సోమవారం బీఆర్ఎస్ క్యాడర్ ను, కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.

సోమవారం మాజీ ముఖ్యమంత్రి డా : వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కానీ ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకంటే ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం స్థానికంగా సర్వత్రా చర్చనీయంశంగా అయ్యింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీ లో విలీనం కాబోతుంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకీ చెందిన డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, నిజాంపేట్ కమ్మ సంఘం అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ వై ఎస్ ఆర్ జయంతి వేడుకలలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం పలు విమర్శలకు, ఉహాగానాలకు తావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి బద్ద శత్రువు వైఎస్ ఆర్ గా పార్టీ గులాబీ అధిష్టానం భావిస్తోంది. ఈ జయంతి వేడుకలు లో పాల్గొన్న వీరిద్దరూ పార్టీ మారబోతున్నారా అనే సాంకేతాలకు ఈ సంఘటన బలాన్ని చేకూర్చుతుంది. స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ వీరి తీరుతో ప్రస్తుతం అయోమయం లో పడ్డారు. ఇంతకీ వీళ్లు బీఆర్ఎస్ ఉన్నట్లా లేక పార్టీ మారినట్లా అనే ప్రశ్నలు బీ ఆర్ఎస్ కార్యకర్తలు లేవనెత్తుతున్నారు.

Next Story

Most Viewed