డుమ్మా కొట్టే సార్లు ఇగ మీ పప్పులుడకై..

by Sumithra |
డుమ్మా కొట్టే సార్లు ఇగ మీ పప్పులుడకై..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా తీసుకోనున్నారు. అందుకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధ్యాయుల డుమ్మాపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూళ్ళకు వెళ్లకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండానే వేతనాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. కొందరు టీచర్లు ఏకంగా బిజినెస్ లు చేస్తుండడంతో ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్లయింది.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ సంచాలకులు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లా జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోనూ శనివారం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ ను తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9:30 నుంచి 9:35 మధ్య ఒకసారి సాయంత్రం 4:40 నుంచి 4:45 నిమిషాల మధ్య మరోసారి సెల్ ఫోన్ లోని యాప్ ద్వారా బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రాథమిక పాఠశాలకు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తేనే వారు స్కూల్ కు హాజరైందిగా పరిగణించి వేతనాలు జారీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా అందరికీ సాఫ్ట్ వేర్లు అప్ డేట్ చేశారు. జిల్లాలోని సుమారు 5 వేల మంది టీచర్లు బయోమెట్రిక్ అటెండెన్స్ పరిధిలోకి వచ్చినట్లయింది. ఇప్పటి వరకు ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాష్టర్ ల దయాదాక్షిణ్యాలపై స్కూల్ కు హాజరవుతూ ఇష్టమొచ్చినప్పుడు ఎగనామం పెట్టే వారికి చెక్ పడనుంది.

Advertisement

Next Story