వామ్మో ఇన్ని పెంకుటిల్లులా...

by Sumithra |
వామ్మో ఇన్ని పెంకుటిల్లులా...
X

దిశ, భిక్కనూరు : ఒకప్పుడు కుటుంబ గౌరవానికి ప్రతీక పెద్ద బవంతి పెంకుటిల్లు. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనాలు ఆ ఇండ్లు. ఆ సమయంలో ఆ ఇంటి యజమానికి సంఘంలో మంచిగౌరవం మర్యాదలు ఉండేవి. తెలంగాణలోని చాలా ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మనకు ఈ పెంకుటిల్లులు కనిపిస్తుంటాయి. గాలి, వెలుతురు వచ్చేలా ఉండే ఆ నిర్మాణాలు, విశాలమైన గదులు, ఎంతో ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉంటాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లో భవంతి లోగిళ్లు ఎక్కువగా ఉండేవి. పచ్చని పంటచేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ పెంకుటిల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఆ తర్వాత పట్టణ ప్రాంతాలకు దీటుగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంక్రీటు భవన నిర్మాణాల సంఖ్య పెరిగింది. దీంతో పల్లెల్లో భవంతి లోగిళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్ తో.. ఎంతో మార్పు..

కరోనాతో ఆత్మస్థైర్యం దెబ్బతిన్న ప్రజలు, ముందుచూపుతో కూడబెట్టడం మానేసి, బతికుండగానే అన్ని రకాలుగా అనుభవించాలన్న ఆలోచన ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెంకుటిల్లులను కూల్చివేసి, చాలా గ్రామాల్లో అధునాతన పద్ధతుల్లో బంగాళాలు, భవంతులు నిర్మిస్తున్నారు. దీంతో పెంకుటిల్లులు కనబడకుండా పోయే పరిస్థితి నెలకొంది. భిక్కనూరు మండలం మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్రంలోనే అత్యధిక పెంకుటిల్లులు ఉన్న మండలంగా వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా పాలన దరఖాస్తుల కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భిక్కనూరు పట్టణంలో 900కు పైగా, ఇదే మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో 700కు పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పెంకుటిల్లులు ఎక్కువగా ఉండడం పట్ల అధికారులు సైతం ఆశ్చర్య పోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఇంత గానం మట్టి గోడల ఇండ్లు ఆ గ్రామాల్లో ఉన్నాయా అంటూ విస్మయం వ్యక్తం చేస్తూనే, నిజమా..? కాదా అని తెలుసుకోవడం కోసం ఆ గ్రామాలకు రెండు రోజులు అధికార యంత్రం వచ్చి పరిశీలించడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బహుళ అంతస్తుల భవనాలు ఆధునిక హంగులతో పోటా పోటీగా నిర్మాణాలు చేపడుతుండగా, అందుకు భిన్నంగా ఇక్కడ డెవలప్ కాకపోవడాన్ని చూసి యంత్రాంగం కూడా నివ్వెర పోయింది. నిజమా కాదా అని తెలుసుకోవడానికి వారం పది రోజుల క్రితం జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ తో పాటు, హౌసింగ్ బోర్డ్ టీం సభ్యులు రెండు రోజులు భిక్కనూరు, పెద్ద మల్లారెడ్డి గ్రామాల్లో పర్యటించారు. అప్పటి వరకు పెంకుటిల్లులు ఎక్కువగా ఉన్న గ్రామాలు ఇవేనా అని తెలిసి స్థానిక అధికారులు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిజంగానే ఉన్నాయా...? లేక సర్వే చేసిన సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటాయా...? అన్న విషయాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకటికి రెండుసార్లు రికార్డులను మర్లేసి చెక్ చేసుకోవలసిన పరిస్థితి అధికారులకు తలెత్తింది.

వాస్తవమేనని గ్రహించిన యంత్రం...

మొదట్లో అనుమానం కలిగినప్పటికీ, అధికార యంత్రాంగం వచ్చి పరిశీలించిన తరువాత పెంకుటిల్లులు ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని యంత్రాంగం గ్రహించింది. సర్వే రిపోర్ట్ లో కాని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరిగాయోనని టెన్షన్ తో ఉన్న స్థానిక అధికారులకు, జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించి వెళ్ళిన తరువాత వారికి ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.

Advertisement

Next Story