ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్ జిల్లాలో కలకలం

by Sridhar Babu |
ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్ జిల్లాలో కలకలం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం హైద్రాబాద్ లోని కవిత నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసి ఢిల్లీ కి తరలించడం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ప్రధానంగా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొన్ని గంటల ముందు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గులాబీ వర్గాలలో కలవరపాటుకు గురిచేసింది. ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ను ఓడిస్తానని శపథం చేసిన కవిత వెనక్కి తగ్గి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎంపీ టికెట్ ఇప్పించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో బోదన్, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తీసుకున్న కవిత అక్కడ ఇద్ధరు సిట్టింగ్ ఎమ్మెల్యేల ఓటమి తరువాత జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కోరుట్లలో ఎంపీ అరవింద్ ఓటమితో తన పంతం నెగ్గిందని, పార్లమెంట్ ఎన్నికలలో ఓడిస్తానని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు.

గత రెండు సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత రేపోమాపో అరెస్టు అంటూ ప్రచారం జరిగినా చివరకు పార్లమెంట్ ఎన్నికల ముంగిట జరగడం కారు పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. తెలంగాణ రాష్ర్ట సమితి వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తనయగా, నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం పోతంగల్ గ్రామం మెట్టినిల్లుగా మాత్రమే ఒకనాడు కవిత సుపరిచితం. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం జరిగిన మలి దశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఊరూరా బతుకమ్మల నిర్వహణ ద్వారా తెలంగాణ సంస్కృతి పల్లే పల్లెకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. ఒకనాడు తెలంగాణ పల్లెలకు పరిమితమైన బతుకమ్మ పండగను గల్లీ నుంచి ఢిల్లీ దాక, ఢిల్లీ నుంచి డల్లాస్ దాక తీసుకుపోవడంలో కవిత పాత్ర ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ర్టంలో చుట్టివచ్చిన కవిత ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ మధుయాష్కిని ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు.

ఎంపీగా ఎన్నికైన తరువాత కవిత చరిష్మా ఎల్లలు దాటింది. లండన్ పార్లమెంట్ హౌస్ లో మాట్లాడటంతో పాటు, దేశ పార్లమెంట్ లో ప్రభుత్వంపై ప్రశ్నల పరంపర సాగించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు దేశంలోని 13 రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేఖలను కుడగట్టారు. ఐతే 2019 పార్లమెంట్ ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు హామీతో అరవింద్ బరిలోనిలిచి కవితను ఓడించారు. రైతులు కుడా పోటీ చేయడంతో కవితకు భారీ ఓటమి తప్పలేదు. దాంతో కవిత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకోగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. 13 నెలల పదవి తర్వాత మరోసారి జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండవసారి ఎంపికయ్యారు. అయితే ఎంపీగా ఉన్న సమయంలోనే కవిత మెడకు ఢిల్లీ లిక్కర్ స్కాం మరకలు అంటడంతో జిల్లాలో ఆమె అరెస్టుపై రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.

ఎంపీ అరవింద్ తో పాటు జిల్లా పర్యటన చేసిన కమలం పార్టీ నాయకులు కవిత అరెస్టు ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు శుక్రవారంతో నిజమయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీకి వెనుకంజ వేసిన కవిత సీటును మాత్రం బాజిరెడ్డికి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రచార బాధ్యతలు, గెలుపు బాధ్యతలు తనవేనని కవిత బాజిరెడ్డిని ఎన్నికల్లో నిలిపారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపులకు టికెట్ ఇస్తే అరవింద్ ను ఓడించడం ఈజీనని భావించి బాజిరెడ్డిని ఓప్పించారని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంగ్ సెగ్మెంట్ లో మూడు స్థానాలు గెలువడంతో పాటు అత్యధిక ఓటింగ్ స్థానం ఉండడంతో బీఆర్ఎస్ గెలుపు కోసం కవిత పక్కా ప్లాన్ వేసినట్లు గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.

తన పంతాన్ని నెగ్గించుకోవడంతో పాటు పార్టీకి ఎంపీ స్థానాన్ని గెలిచి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పినట్లు క్యాడర్ చెబుతుంది. ఈ నెల 13న తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న కవిత అదే రోజు నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలకు బీసీలకు టికెట్లను ఇప్పించి తన సత్తాను చాటారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బాజిరెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యేలను, మాజీలను ఏకతాటిపైకి తెస్తానని పార్టీ అధినేతకు ఇచ్చిన మాట కోసం రంగంలో దిగకముందే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగడం బీఆర్ఎస్ పార్టీలో కలవరానికి గురి చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను ఎవరికి ఇస్తారోనని ఇప్పుడు చర్చ మొదలైంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కవిత తరహాలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పని చేయించడం, గెలిపించే బాధ్యతలు పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికి ఇస్తారోననే చర్చ ప్రారంభమైంది.

Advertisement

Next Story