తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : కలెక్టర్

by Kalyani |
తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : కలెక్టర్
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు సమస్యలు సభ దృష్టికి తెచ్చారు. మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా 10 ఎంఎల్ డి నీటి సరఫరా కావాల్సి ఉండగా కేవలం 3 ఎంఎల్ డి మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. వెంటనే నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. అలాగే మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎజెండా అంశాల వారీగా చర్చించారు.

మొత్తం 25 అంశాల్లో 24 అంశాలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసుల సహకారంతో నిర్మాణాలను తొలగించాలన్నారు. అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని, ఎక్కడైనా నిర్మాణం జరిగితే నిర్మాణ దశలోనే నిలిపివేయాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణ వందశాతం చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు లేకుండా చూడాలని, ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే చేపట్టాలన్నారు. కొత్తగా మొక్కలు నాటాలని, ఇంటింటికి మొక్కలు సరఫరా చేయాలని సూచించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ప్రకటన పన్నులతో ఆదాయం పెంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరుదొండ వనిత, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ డుమ్మా…

కామారెడ్డి మున్సిపాలిటీ లో నాలుగున్నరేళ్లుగా చైర్మన్ గా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి సమావేశానికి డుమ్మా కొట్టారు. చైర్మన్ పై అవిశ్వాసం తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో నూతన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ ఎన్నిక తర్వాత శుక్రవారం రెండవ మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ రెండు సమావేశాలకు కౌన్సిలర్ గా సమావేశానికి మాజీ చైర్మన్ హాజరు కావాల్సి ఉన్నా రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

Next Story

Most Viewed