Yadadri Temple : యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణమయ ఆకృతి ఖరారు

by Y. Venkata Narasimha Reddy |
Yadadri Temple : యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణమయ ఆకృతి ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి ఆలయానికి కొత్తరూపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణమయ ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో.. ఆలయ విమాన గోపుర స్వర్ణమయం చేయనున్నారు. యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇటీవలే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఆకృతి ఖరారుతో త్వరలోనే పనులు మొదలు కానున్నాయి. తొలుత స్వర్ణతాపడాన్ని 127 కిలోల బంగారంతో చేయాలని నిర్ణయించినా వివిధ కారణాలతో దాన్ని 65 కిలోలకు తగ్గించారు. విరాళాల ద్వారా ఇప్పటివరకు 11 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు సమకూరినట్లు సమాచారం. బంగారు తాపడంపై పూర్తి వివరాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడవుతాయని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విరాళాల ద్వారా వచ్చిన నగదుతో బంగారం కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఆలయం మెుదటి స్థానంలో ఉంటుంది. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయానికి పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రం పాత ఆలయాన్ని తొలగించి కొత్తగా పునర్నిర్మాణం చేపట్టింది. పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలలతో కూడిన శిల్పకళతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు. బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులు, తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు నిర్మించారు. పడమర సప్తతల రాజగోపురంతోపాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణశిలలతో తీర్చిదిద్దారు. గతంలో ఆలయానికి ప్రాకారాలు లేకపోవటంతో కొత్తగా బాహ్య, అంతర ప్రాకారాలు నిర్మించారు. యాళీ పిల్లర్లతో పాటు అష్టభుజి మండపాలతో యాదాద్రి ప్రధానాలయం కనువిందు చేస్తుంది. స్వామివారికి ప్రత్యేక రథశాల, పడమర ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వేంచేపు మండపం, తూర్పు ప్రాంతంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలో ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం నిర్మాణం చేపట్టారు.

Next Story

Most Viewed