ఫైనాన్స్ ఆఫీసులో ఏజెంట్ వీరంగం.. డబ్బులు ఇవ్వడం లేదనీ ఫర్నీచర్ ధ్వంసం

by Disha News Web Desk |
ఫైనాన్స్ ఆఫీసులో ఏజెంట్ వీరంగం.. డబ్బులు ఇవ్వడం లేదనీ ఫర్నీచర్ ధ్వంసం
X

దిశ, కామారెడ్డి: చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ ఆ కార్యాలయంలో వీరంగం సృష్టించాడు. మంగళవారం కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చైత్ర రథ ఫైనాన్స్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధిత ఫైనాన్స్ ఏజెంట్ అరుణ్ కుమార్ వివరాల ప్రకారం.. గత 15 ఏళ్లుగా ఆర్మూర్‌కు చెందిన అరుణ్ కుమార్ చిట్ ఫండ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా కామారెడ్డి చైత్రరథ చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంటుగా పని చేస్తున్నాడు. అరుణ్ కుమార్ తరపున సుమారు 200 మంది సభ్యులను కంపెనీలో చేర్చి చిట్టి డబ్బులు చెల్లిస్తున్నాడు. అయితే, గత 14 నెలలుగా చిట్టీలు లిఫ్ట్ చేసిన వారికి డబ్బులు ఇవ్వడానికి చిట్ ఫండ్ మేనేజర్ దయాకర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అరుణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం తన ఇంటికి బాధితులు వచ్చి ఇంట్లోని ఫ్రిజ్‌ను పగులగొట్టారని చెప్పాడు.

కస్టమర్లకు ఇవ్వాల్సిన చిట్టిలో తనకు రావాల్సిన కమీషన్ తీసుకుని ఇవ్వాలని మేనేజర్‌ను కోరినా.. పట్టించుకోవడం లేదని, ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్మూర్‌లో సుమారు 50 మందికి 13 లక్షల వరకు చిట్టి డబ్బులు రావాల్సి ఉందని తెలిపాడు. చిట్టీల డబ్బులు చెల్లించిన బాధితులు తన ఇంటిచుట్టు తిరుగుతున్నారని, కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వారి పేరుమీద ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అనంతరం ఆగ్రహంతో ఆఫీసులోని కుర్చీలు, టేబుళ్లు పగులగొట్టాడు. కంపెనీ నుంచి తనకు రావాల్సిన డబ్బుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed