హస్తం గూటికి మరో 9 మంది కౌన్సిలర్లు

by Sridhar Babu |
హస్తం గూటికి మరో 9 మంది కౌన్సిలర్లు
X

దిశ, కామారెడ్డి క్రైం : అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ బలం మేమే అంతా అనే స్థాయి నుండి నేడు మేము ఇంతే అనే స్థితికి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్​గా కామారెడ్డి సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్​రావు కూతురు నిట్టు జాహ్నవి నాలుగు సంవత్సరాల కాలం వరకు పాలన నిర్వహించారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పార్టీలోని ప్రజాప్రతినిధులు హస్తం గూటికి పయనమవుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలోని కొందరి పెద్దల ఒంటెద్దు పోకడలు, కనీసం తమ కౌన్సిలర్, సర్పంచుల పదవులకు కూడా మర్యాద ఇవ్వకపోవడమే. అప్పటి అసహనం నేటి వలసలకు కారణం అవుతుంది. చైర్మన్ పదవి కాలం సంవత్సర కాలం కూడా లేనప్పటికీ కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లకు గాలం వేయగా, మరికొందరు తమ పరిధిలోని పనుల్లో సైతం తమ ప్రమేయం లేకుండా లాక్కున్నారనే కోపంతో హస్తం గూటికి పయనం అవుతున్నారు.

హస్తం గూటికి చేరిన మరో 9 మంది కౌన్సిలర్లు

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు 2019 సంవత్సరంలో జరుగగా 49 స్థానాలకు గాను బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8, స్వసంత్రులు 6 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు నాలుగు సంవత్సరాల కాలంలో పెద్ద మార్పులు లేకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి తరువాత భారీగా వలసలు ప్రారంభం అయ్యాయి. వీరు అవిశ్వాసం ప్రకటించే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్లు ఉండే వారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్​కు అవిశ్వాస తీర్మానం

అందజేసి హైద్రాబాద్ క్యాంపునకు బయలు దేరారు. కొద్ది రోజులు హైదరాబాద్​లోని ఓ రిస్టార్లో ఉన్న వీరు ప్రస్తుతం గోవాకు క్యాంపు మార్చారు. అయితే మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 9 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి వెళ్లారు. అయితే ఇందులో చాలా వరకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాచారెడ్డి మండల ప్రధాన నాయకుడి అనుచరులు ఉన్నారు. కాగా కాంగ్రెస్ 12 సీట్ల నుండి 36 సీట్లకు చేరి చైర్మన్ పీఠం దించేందుకు 1/3 బలంతో సిద్ధంగా ఉన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో వీరు చైర్మన్ పీఠం కైవసం చేసుకోనున్నారు.

చైర్మన్ పీఠం వరించేది ఎవరికో ?

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఎవరు కూర్చుంటారనే అంశం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ గొడవతో బీఆర్ఎస్ పార్టీలో నుండి బయటకు వచ్చిన దేవునిపల్లి ప్రాంతానికి చెందిన ఉరుదొండ వనిత రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం నుండి చైర్మన్ పీఠం కోసం పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాలం వేస్తూ వస్తున్నారు.

అయితే 12 నుండి 36 వరకు సంఖ్య పెరగడంతో మరి కొందరికి సైతం చైర్మన్ పీఠంపై ఆశలు పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకు బయటకు కలిసే ఉన్నా క్యాంపులో రెండు గ్రూపులుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్​రెడ్డి సైతం చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. చైర్మన్ పీఠం హస్తగతమే అయినప్పటికీ కుర్చీలో ఎవరు కూర్చుంటారనేది హైకమాండ్ చేతిలో ఉంది. చైర్మన్ ఎవరు అనేది మరో నాలుగు రోజులు వేచి చూడాలి.

అనుచరుల పార్టీ పిరాయింపు అసహనమా, నేతల ఆదేశాలా ?

బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు అనే స్థాయి నుండి నేడు నాయకులెవరున్నారు అనే స్థాయికి చేరుకుంది. పదేళ్ల కాలంలో నిర్మించుకున్న బలం కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే చెల్లాచెదురైపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ప్రధాన నాయకుల సమన్వయ లోపం, మరి కొందరు నాయకుల ఒంటెద్దు పోకడలు చివరికి పార్టీని చిన్నాభిన్నం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి సొంత పార్టీ నేతలే సదరు మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేయడం, మరికొందరు తమకు సీటు కావాలని హైకమాండ్ వద్ద ఫైరవీలు చేశారు.

దాంతో బయటకు మంచిగానే ఉన్నా లోలోపల వ్యక్తులపై కుట్రలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కార్యకర్తలు మినహా నాయకులు ఎవరూ పనిచేయలేదనేది బహిరంగ సత్యం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన నాయకులైన నలుగురు వ్యక్తులకు సంబంధించిన అనుచరులు పార్టీ పిరాయింపులపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై అసంతృప్తితో పార్టీ నుండి వెళ్లారా లేక వీరి ఆదేశాల మేరకే కాంగ్రెస్ గూటికి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పతనానికి అప్పట్లో, ప్రస్తుతం ఉన్న కొందరి సీనియర్ నాయకులే అనేది బహిరంగ సత్యం. అయితే ప్రస్తుతం అరకొరగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కొందరు కమలం వైపు చూస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed