Farmers : కొనుగోళ్లు లేక.. అకాల వర్షాలకు తట్టుకోలేక..

by Sumithra |
Farmers : కొనుగోళ్లు లేక.. అకాల వర్షాలకు తట్టుకోలేక..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ వైపు వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు ( Farmers ) సతమతమవుతున్నారు. వరి కోతలు పూర్తయ్యి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుగా పోసిన ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ లో వరి కోతలు ఇప్పటికే దాదాపు 65 శాతం పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లపై ధాన్యపు ఆరబోతలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆరబోతలు పూర్తయి పూర్తిగా ఎండిన ధాన్యాన్ని అమ్ముదామంటే కొద్ది రోజుల క్రితం వరకు ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ప్రారంభించక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.

కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు రోడ్లపైన, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం పూర్తిగా తడవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింది. దీంతో పండించిన పంటలకు కనీస మద్ధతు ధర కూడా దక్కుతుందో లేదోననే భయంతో తేమ పేరుతో ఇబ్బందులు పడేకన్నా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకైనా ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. ధాన్యం దిగుబడి అంచనాను బట్టి ధాన్యం సేకరణ కోసం అధికారులు 1,650 కొనుగోలు కేంద్రాలను ( Buying centers ) ప్రతిపాదించారు. 370 కేంద్రాలు ప్రారంభినట్లు చెపుతున్నారు. కానీ, ఎక్కడా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదే విషయం పై అధికారులను అడిగితే త్వరలో గైడ్ లైన్స్ వస్తాయని రేపటిలోగా రావొచ్చని చెబుతున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైస్ మిల్లర్ల వ్యవహారం ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ 460 వరకు రైస్ మిల్లులున్నాయి. సీఎంఆర్ ( CMR ) ఇవ్వని రైస్ మిల్లులకు అధికారులు ఇదివరకే నోటీసులు జారీచేసినా, పలుమార్లు హెచ్చరించినా మిల్లర్లు తేలిగ్గా తీసుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. దీని పై కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.

క్యూ కడుతున్న ప్రైవేటు వ్యాపారులు..

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారులు రైతుల కల్లాల వద్దకు క్యూకడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్ధతు ధర కన్నా వంద రూపాయలు తక్కువగా చెల్లిస్తున్నప్పటికీ రైతులు ప్రైవేట్ వ్యాపారులకే తమ ధాన్యాన్ని అమ్మడానికి మొగ్గుచూపుతున్నారు. దళారులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తుండటంతో పాటు తేమ పేరుతో తరుగు వంటి అంశాల జోలికి వెళ్లడం లేదని రైతులంటున్నారు. కేవలం బార్దాన్ (సంచి) తరుగు కిలో తీసేస్తున్నారని అంతకు మించి ఏమీ తీయడం లేదని రైతులు చెపుతున్నారు. అధికారులు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనడం లేదని, ఇప్పటికే రోడ్ల పై ఆరబోసిన ధాన్యం మూడు సార్లు తడిసిపోయిందని రైతులంటున్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్ముతా.. నడుకుడ స్వామి, కలిగోట్ గ్రామం, జక్రాన్ పల్లి మండలం

నేను పదెకరాల్లో వరి పంట వేశాను. దాదాపు 300 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాదాపు రెండు లారీ లోడ్ల వరకు నా దగ్గర ధాన్యం ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముదామనే ఉద్దేశంతో పది రోజుల నుంచి కుప్ప పోసి టార్ఫాలిన్ కవర్లు కప్పిఉంచాను. మొన్ననే ఎఫ్ సీఐ వారు కొనుగోలు కేంద్రం ఇక్కడే స్టార్ట్ చేశారు. కానీ కాంటా వేయడం లేదు. అలాగని ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే నాకు క్వింటాలుకు రూ.రూ.5000 లు నష్టం వస్తుంది. అందుకే ప్రైవేటు దళారులకు అమ్మడం లేదు. నాలాగే ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించిన రైతులు నలుగురైదుగురు మాత్రమే కుప్పలు పోసి ఉంచారు. దాదాపు మా కలిగోట్ గ్రామంలో 70 శాతం మంది రైతులు వర్షాల భయంతో పంటను దళారులకు అమ్మేశారు.

బాగ రోజులైతుంది.. చూసీచూసీ ప్రైవేటోళ్లకు అమ్మేసిన.. నాయిక దేవన్న.. (రైతు) కలిగోట్ గ్రామం. జక్రాన్ పల్లి మండలం

మా పంట కోసి బాగ రోజులాయె.. వడ్లు ఎండబెట్టి గవర్నమెంటోళ్లకు అమ్ముదామంటే ఇంకా కాంట వెడ్తలేరు. ఇప్పటికే ఎండిన వడ్లు మూడు సార్లు తడిసినయ్.. మల్లా మల్లా రోడ్ల మీద ఎండవెట్టుకున్నం. మల్లా వాన వడితే పరేషానెందుకని ఇగ ప్రైవేటోళ్లకు తక్కధరైతే తక్కుధరాయె అని అమ్మేసినం. మొన్న వానకు తడిసిన వడ్లు ఇంకా గొన్ని ఉన్నయ్ అవ్విటిని ఎండబెడుతున్న. ఇవి కూడా ఆళ్లకే అమ్మేస్తా.

Advertisement

Next Story

Most Viewed