జీరో మెయిన్‌టెనెన్స్‌కు రూ.2.50 లక్షలా..! పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత ప్రహసనం

by Shiva |
జీరో మెయిన్‌టెనెన్స్‌కు రూ.2.50 లక్షలా..! పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత ప్రహసనం
X

దిశ, నిజామాబాద్ సిటీ: రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా మారింది నిజామాబాద్ బల్దియా వ్యవహరం. గత ప్రభుత్వ హయంలో నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లలో 28 ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. వాటికి ప్రతి నెలా మెయిన్‌టెనెన్స్ అని ప్రైవేట్ సంస్థకు నెలకు రూ.2.50 లక్షలు చెల్లిస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ వ్యవహరం జరుగుతోంది. ఇప్పటి వరకు కోటికి పైగా సదరు కాంట్రాక్ట్ సంస్థకు చెల్లింపులు జరిగాయంటే అతిశయోక్తి కాదు. పబ్లిక్ టాయిలెట్లపై పర్యవేక్షించాల్సిన బల్దియా ఆరోగ్య శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పబ్లిక్ టాయిలెట్లు కొన్ని చోట్ల నీళ్లు లేక, మరికొన్ని చోట్ల శుభ్రం చేసే వారు లేక మరుగున పడుతున్నాయి.

నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు వేశారు. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్లలో ప్రతినిత్యం శుభ్రత ఉంచేందుకు ప్రైవేట్ సంస్థకు ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండానే టెండర్లు పిలువకుండానే అప్పగించిన్లు సమాచారం. ఆనాడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అనుచరుడికి పబ్లిక్ టాయిలెట్ మెయింటెనెన్స్ బాధ్యతను అప్పగించారు. వాటిని పర్యవేక్షించాల్సి బల్ధియా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లపై పర్యవేక్షణ కరువైంది. గత ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం చౌరస్తాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు వినియోగం లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచడం గమనార్హం.

అయితే, మున్సిపల్ అధికారులు మాత్రం ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీటి నిర్వహణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు నెలకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. సంవత్సరానికి దాదాపుగా రూ.30 లక్షల రూపాయలు టాయిలెట్ల కోసం ఖర్చు చేస్తున్నారు. నగరంలో ఇలాంటివి 28 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే వాటిని మెయిన్‌టెనెన్స్ చేస్తున్నారా లేదా అన్ని విషయంపై స్పష్టత లేదు. ఇదే విషాయాన్ని స్థానికులను అడిగితే.. డబ్బా నీళ్లు పోసింది లేదు, చీపురు పట్టి శుభ్రం చేసింది చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత టూటౌన్, నగర శివారులోని బొర్గాం(పి), హమాల్ వాడీ, వీక్లీ మార్కెట్ ప్రాంతంలో, మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి చూస్తే తెలుస్తోంది. వారి పర్యవేక్షణ ఎలా ఉందో ఆ కార్యాలయం పక్కనే ఉన్న టాయిలెట్లను శుభ్రం చేయించలేని సానిటేషన్ అధికారులు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి.

ప్రతినిత్యం పరిశుభ్రత పాటించాలనే చెప్పే అధికారులే పబ్లిక్ టాయిలెట్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారో వారికే తెలియాలి. చాలా కాలం నుంచి టాయిలెట్లను శుభ్రం చేయనట్లు కనిపిస్తుంది. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బులను దుబారా చేయడం కార్పొరేషన్ అధికారులకే చెల్లింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ఎన్ని పనులకు, ఎంత మందికి రూ.లక్షల లెక్కలు బయటకు రావాల్సి ఉంది. కార్పొరేషన్లలో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులు తమను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాలో ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేయని టాయిలెట్లకు నెలకు రూ.2.5 లక్షలు ప్రభుత్వం చెల్లించడం పట్ల నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

త్వరలోనే అందుబాటులోకి పబ్లిక్ టాయిలెట్స్: మున్సిపల్ కమిషనర్ మకరంద

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుమారు 28 పబ్లిక్ టాయిలెట్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చించామని అన్నారు. ప్రత్యేకంగా వీటి అభివృద్ధి కోసం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను నియమించి అతి త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ మంద మకరంద తెలిపారు. అదేవిధంగా ఈ వారంలో ఇదే విషయం మీద సంబంధిత సానిటరీ కాంట్రాక్టర్‌తో సమావేశం కూడా నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు.

Next Story