- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధరణి’తో దెబ్బతిన్న భూ వ్యవస్థను గాడిన పెట్టడమే లక్ష్యంగా కొత్త చట్టం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూపరిపాలన అస్తవ్యస్తంగా మారింది. భూ రికార్డుల ఆధునీకరణ కోసం కేంద్రంలోని ఎన్డీయే-1 ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ. 87 కోట్లు రాగా, ఆ నిధులతో హడావుడిగా భూ రికార్డుల ప్రక్షాళన (ఎల్ఆర్ యూపీ) చేపట్టింది. అప్పటి వరకు ఉన్న భూ చట్టాలు సమీక్షించకుండా, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా కేవలం 100 రోజుల్లో పని పూర్తి చేసింది. మోఖాతో సరిపోల్చకుండా పహనీలను కంప్యూటరైజ్ చేసింది. ధరణి పోర్టల్ పేరుతో ఆ డేటాకు చట్టబద్ధత కల్పించింది. ఆ తర్వాత అవినీతి పేరుతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్ వచ్చాక వ్యవసాయ భూముల ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ తో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే రూ.60 వేల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు పరమయ్యాయని, కోర్టుల్లో ఉండగానే క్లాసిఫికేషన్ చేంజ్ చేసి వందలాది ఎకరాలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారని తెలంగాణ విశ్రాంత రెవెన్యూ అధికారుల సంఘం ఆధారాలతో సహా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు లేఖ రాసింది. ఇలా గాడి తప్పిన భూ పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్-2024ను తీసుకువస్తున్నది. ఈ చట్టం వచ్చాక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతాంగం, ప్రజానీకం భావిస్తున్నది. ఈనేపథ్యంలో నూతన చట్టం డ్రాఫ్ట్ పై రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఆర్వోఆర్-2020తో అనేక సమస్యలు
ఆర్వోఆర్-2020లో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రవేశపెట్టడం, అప్పీల్ వ్యవస్థ లేకపోవడం, రెవెన్యూ కోర్టులను రద్దు చేయడంతో కొత్తగా లక్షలాది భూ సమస్యలు తలెత్తాయి. ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం హెచ్చు తగ్గులు, సాదాబైనామా, సివిల్ కోర్టు కేసులు. గ్రామాల్లో పరిష్కారమయ్యే సమస్యలను ధరణి పేరుతో హైదరాబాద్ సీసీఎల్ఏ వరకు తీసుకెళ్లారు. లక్షలాది ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో భూ యజమానులు, సన్న, చిన్న కారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్నతాధికారులు, ధరణి అవుట్ సోర్సింగ్ సాంకేతిక సహాయ సిబ్బంది చేసిన ఆగడాలు, వసూళ్లు, కమిషన్లు, సెటిల్మెంట్లు పెచ్చుమీరాయి. ఆ తర్వాత ధరణి రూపకర్త అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, ఆయనతో అంట కాగిన జిల్లా కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి తెలంగాణ భూ దందాపై ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి.
కొత్త చట్టంతో లాభాలివి..
భూమి పటం: కొత్త చట్టం వల్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తే హద్దులతో కూడిన భూమి పటం పట్టాదారు పాసుబుక్కులో చేర్చే అవకాశం ఉంది. దీని ద్వారా హద్దుల సమస్యలు, విత్తనం వేసే సమయంలో గట్టు పంచాయతీలు ఉండవు. తద్వారా కోర్టుల్లో సివిల్ కేసుల భారం తగ్గుతుంది. పోలీస్ స్టేషన్లలోనూ వివాదాలు తగ్గుతాయి.
అప్పీలు వ్యవస్థ: ప్రస్తుతం ఏదైనా యాజమాన్య హక్కుల వివాదం తలెత్తితే సివిల్ కోర్టుకే వెళ్లాలి. అయితే లాయర్లు నియమించుకొని, వ్యయప్రయాసలకు ఓర్చి ఏళ్ల తరబడి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఆ విచారణలో రెవెన్యూ శాఖ నివేదికలే ప్రామాణికమవుతాయి. పాత చట్టంలో ఆర్డీవో, అదనపు కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ కోర్టులతో అప్పీలు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కొత్త చట్టంలో కూడా రెవెన్యూ కోర్టులను చేర్చారు.
టైటిల్ గ్యారంటీ చట్టం: ఆర్వోఆర్-2024 ద్వారా టైటిల్ గ్యారంటీ చట్టానికి బాటలు పడతాయి.
అభ్యంతరాలు ఉంటే పట్టా మార్పిడి ఆపడం: ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్-మ్యుటేషన్, ధరణి రికార్డుల వల్ల ఎన్నో తప్పుడు పట్టాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూములు సైతం పరాధీనమయ్యాయి. కొన్ని పట్టా భూములు అనర్హుల పేరిట మార్పిడి చేశారు. ఇలాంటి తప్పులు సరిదిద్దటానికి ఆర్వోఆర్-2020 లో వెసులుబాటు లేదు. బాధితులు సివిల్ కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకుంటేనే సవరించడానికి ఆస్కారం ఉండేది. ప్రభుత్వ భూముల పట్టా మార్పిడి జరుగుతున్నదని తెలిసినా ఆపే అధికారం తహశీల్దారుకి లేదు. రికార్డుల ప్రక్షాళన సమయంలో ఇతరుల పేరిట నమోదైన పట్టా భూములు తిరిగి పొందాలంటే కోర్టు డిక్రీ లేదా తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి అభ్యంతరాలున్న వాటిని ఆపే అధికారం తహశీల్దారుకి ఇవ్వాలి అనే వెసులుబాటు కొత్తచట్టంలో ఉంది. దీని వల్ల అనవసర కోర్టు కేసులు తగ్గుతాయి.
సాదాబైనామాలకు పరిష్కారం: సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, నేటికీ పట్టా పొందని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సాదాబైనామా కేసులను 2017 ఎల్ఆర్ యూపీ సందర్భంగా ఉచిత సాదాబైనామా పథకం అమలు చేయకపోవడంతో అవి నేటికీ పరిష్కారం కాలేదు. కానీ ధరణి ద్వారా దరఖాస్తులు స్వీకరించి అన్నిటినీ పీవోబీ జాబితాలో చేర్చారు. దీని వల్ల పట్టాలు జారీ కాక, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీకి అర్హులు కాక లక్షలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాటికి పరిష్కరిస్తేనే మున్ముందు లావాదేవీలు పెరిగి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తుంది. యాజమానులకూ హక్కులు దాఖలు పడతాయి.
అధికారాల వికేంద్రీకరణ: నిషేధిత జాబితాలోని ప్రతీ సర్వే నంబరు రిలీజ్ చేయడానికి తహశీల్దార్ నుంచి ఆర్డీవో, అక్కడి నుంచి కలెక్టరు, ఆపై సీసీఎల్ఏ వరకు ఒక ఫైల్ వెళ్లాల్సి వస్తున్నది. పేరు, వ్యక్తిగత వివరాల్లో అక్షర దోషాలకు కూడా ఇదే పద్ధతి ఉంది. ప్రస్తుత ధరణిలో 35 మాడ్యూళ్లు ప్రవేశపెట్టినా ప్రతీ అర్జీ హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వస్తున్నది. దీని వల్ల అర్జీదారుపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. కొత్త చట్టం ద్వారా ఒక్కో ప్రత్యేక సమస్య వ్యవస్థలో ఒక హైరార్కీలో అంటే తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం కావడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీనివల్ల అనవసర బ్యూరోక్రటిక్ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. ధరణి అర్జీలు ఆర్థిక భారం, జిల్లా కేంద్రం, హైదరాబాద్, సివిల్ కోర్టుల చుట్టూ తిరిగే భారం తగ్గుతుంది.
యూనిక్ నంబర్: భవిష్యత్తులో సమగ్ర సర్వే, ప్రతి కమతానికి కచ్చితమైన హద్దులిచ్చేందుకు అక్షాంశాలు, రేఖాంశాలు (కోఆర్డినేట్స్) నిర్ధారణ జరుగుతుంది. ప్రతి భూ కమతానికి కూడా దేశంలోనే మొట్ట మొదటగా యూనిక్ నంబర్ ఇవ్వడం ద్వారా యాజమాన్య హక్కుల వివాదాలు ఆగిపోతాయి. ఇది ఒక విధంగా విప్లవాత్మకమైన నిర్ణయం.
ఆలస్యమెందుకు?
ధరణి పోర్టల్ వచ్చాక భూ విస్తీర్ణం సమస్యలు, సాదాబైనామా పెండింగ్, కోర్టు కేసులు, రికార్డుల్లో తప్పులు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటి పరిష్కారానికి లక్షలాది దరఖాస్తులు రాగా, ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి. ఆర్వోఆర్-2024 ద్వారా వీటికి పరిష్కారం లభించే అవకాశముంది. అయితే నూతన చట్టం డ్రాఫ్ట్ ఆమోదం పొందడంలో ఎందుకు ఆలస్యమవుతున్నదన్న చర్చ నడుస్తున్నది. కొత్తం చట్టం అమలులోకి వస్తే ఎవరి పీఠాలు కదులుతాయి? ఎవరి అక్రమాలు బయటపడతాయి? అని రాజకీయ వర్గాల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన త్వరలో ఏడాది పూర్తవుతున్నందున భూ పరిపాలనలో మార్పునకు శ్రీకారం చుట్టకపోతే ప్రభుత్వ వైఫల్యంగా తిపక్షం బద్నాం చేసే అవకాశముందనే చర్చ జరుగుతున్నది.