రైతులకు కొత్త రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-07-18 09:37:37.0  )
రైతులకు కొత్త రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ఇచ్చే నిధులను రైతు రుణమాఫీకే వినియోగించాలని, ఆ డబ్బులను రైతులకు సంబంధించిన మరే ఇతర అప్పులకు మళ్లించకూడదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని, లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దని సూచించారు. ఈ విషయంలో లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఆగస్టు నెల దాటకముందే రూ. 31 వేల కోట్లు రుణమాఫీ కింద విడుదల చేస్తామని, ఇవాళ సాయంత్రం 4 గంటలకు 11 లక్షల పైబడి రైతులకు రూ.6,000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు. ఇవాళ హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో పాటు రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీ స్కీమ్ అమలుపై బ్యాంకర్లకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్ లోన్లు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమన్నారు. రుణమాఫీ పథకం అమలులో బ్యాంకర్ల సహకారం కోరుతున్నామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకర్లు చూడాలని, చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇది పండగ రోజు.. పండగలా రుణమాఫీ జరగాలన్నారు.

రైతుల కోసం భవిష్యత్తులో మరిన్ని పథకాలు

రైతుల కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, పథకాలు తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని భట్టి విక్రమార్క చెప్పారు. సాంప్రదాయ పంటలతో పాటు కమర్షియల్ క్రాప్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకుల్లో రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులకు వివరించాలన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు : తుమ్మల

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన మాటకు కట్టుబడి దీక్షలా రుణమాఫీ పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించమని హెచ్చరించారు. రైతు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నట్లయితే వారికి నగదు రూపంలో ఖాతాలకు జమ చేయబడిన మొత్తాన్ని చెల్లించాలని, ఒకవేళ రైతు పంటరుణాన్ని బాకీ పడ్డట్లయితే వారికి ప్రభుత్వాలు విడుదల చేసిన మొత్తాన్ని రుణం కింద జమ చేసుకొని, కొత్త రుణాన్ని వెంటనే మంజూరు చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed