- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో ‘కొత్త’ జోష్.. ప్రతిపక్షాల అలర్ట్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో కొత్త జోష్ కనిపిస్తున్నది. రెట్టింపు ఉత్సాహంతో ఆయన పర్యటనలు సాగిస్తున్నారు. మీకు నేనున్నా.. మీ వెంటే నేనుంటా అంటూ తన సన్నిహితులకు ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఎంపీగా దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయన పర్యటనలు చేస్తున్నప్పటికీ ఈ మధ్య దుబ్బాక సెగ్మెంట్లో చేస్తున్న ఆత్మీయ పలకరింపులు, పర్యటనల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన రానున్న ఎన్నికల్లో దుబ్బాక సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు గులాబీ బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయనలో ఉత్సహం కనిపిస్తోంది. ఎంపీ దూకుడుతో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు బల ప్రదర్శనపై దృష్టి సారించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
– దిశ, సంగారెడ్డి బ్యూరో
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే స్థానంపై దృష్టి సారించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తన సొంత నియోజకవర్గం దుబ్బాక నుంచి పోటీ చేయనున్నట్లు సన్నిహితులకు చెప్పుకున్న ఆయన కొంత కాలంలో దుబ్బాకపై ప్రత్యేక నజర్ పెట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణిని బరిలో దింపగా ఓటమి చెందారు. ఇదిలా ఉండగా రామలింగారెడ్డి మరణంతో ఇక ఈ స్థానంపై ఎంపీ కొత్త దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా ఇటీవల ప్రగతి భవన్ జరిగిన పార్టీ ప్లీనరీల్లో సీఎం కేసీఆర్ దుబ్బాక ప్రస్తావన తీసుకువచ్చారు. అక్కడ పార్టీని బలోపేతం చేయాల్సి ఉన్నది. ప్రభాకర్ రెడ్డి దుబ్బాకను బాగా చూసుకో, బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని అని సూచించారు. ఇక దుబ్బాక నీదే చూసుకో అని చెప్పకనే చేప్పేశారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కబురందడమే ఆలస్యం.. వాలిపోవడమే..
తొమ్మిదేళ్లుగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పర్యటిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ ప్రోగ్రాంలకు కూడా వెళుతుంటారు. అయితే ఇటీవల మాత్రం కేవలం దుబ్బాకపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏకంగా సీఎం కేసీఆర్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావడంతో మరింత దూకుడు పెంచాడు. చిన్న కబురందినా దుబ్బాకలో కొత్త వాలిపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. రోజు వారీగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను చుట్టేస్తున్నారు. వివిధ కారణాలతో చనిపోయిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఓదార్చి వారి సమస్యలను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి నేనున్నాను బరోసా ఇస్తున్నారు. అపదలో ఉన్న పార్టీకి చెందిన పలువురికి సొంతంగా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఎంపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని, ఇదే తీరుతో ముందుకు సాగితే భారీ మెజార్టీతో కొత్త విజయం ఖాయమని పార్టీ నాయకులు మురిసిపోతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్...
దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖారారు కావడంతో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కత్తి కార్తీక వంటి వారు స్థానికంగా పర్యటిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారం తీసుకుని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం, నిధుల మంజూరుకు కొత్త కృషి చేస్తున్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఇటీవల నిర్వహించిన పార్టీ సమ్మేళనాలు గ్రాండ్ సక్సెస్ చేయించారు. అందరిని కలుపుకునిపోతున్నారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులతో సంబంధాలున్న ప్రభాకర్ రెడ్డి రోజు వారీగా ఫోన్లు చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికపై కూడా దృష్టి సారించారు. వడగండ్ల బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇలా ప్రతి అంశంలో ప్రణాళికబద్ధంగా కొత్తగా ముందుకు సాగుతున్నారని, ఆయన సన్నిహితులు, పార్టీ నాయకులు చెబుతున్నారు.
గ్రూపుల గోల సద్దుమణిగినట్లేనా..?
దుబ్బాకలో తాము బరిలో ఉంటామని సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సతీశ్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. అయితే మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలోనే ఓ సారి సీఎం కేసీఆర్ వద్దకు సతీశ్‌ను తీసుకువెళ్లి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నప్పటికీ పోటీ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో పోటీకి అన్ని విధాలుగా లైన్ క్లీయర్ అయ్యిందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి హరీశ్ రావుతో సాధ్యమైనంత వరకు దుబ్బాకలో ఎక్కవ పర్యటనలు చేయిస్తూ అభివృద్ధికి నిధుల మంజూరు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు అయినప్పటికీ అభివృద్ధికి నిధులు తానే తీసుకువచ్చాననే ప్రచారం చేసుకోవడంపై ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించారు. మొత్తంగా కొత్త జోష్ పర్యటనలతో దుబ్బాకలో ఎన్నికల వాతావరణ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.
Read More: దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి.. మెదక్ ఎంపీగా పోటీ చేసేది ఈయనే!