వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం.. కొత్త ఈవీఎంలు

by samatah |   ( Updated:2023-05-13 05:50:34.0  )
వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం.. కొత్త ఈవీఎంలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో కొత్త ఈవీఎంలను వాడడానికి రంగం సిద్ధమైంది. ఈసీఐఎల్ నుంచి ఇప్పటికే 73,210 ఈవీఎంలు, 54,310 కంట్రోల్ యూనిట్లు, 53,255 వీవీప్యాట్‌లు రాష్ట్రానికే చేరుకున్నాయి. అన్నీ కొత్త మెషీన్లు కావడంతో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ప్రక్రియ ముగిసింది. అవన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చింది. ఈసీఐఎల్ నుంచి వచ్చిన అన్ని కొత్త మెషీన్లు ఎం-3 మోడల్‌కు చెందినవిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి అవన్నీ బాగా పనిచేస్తున్నట్లు తెలిపాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన మేరకు కొత్త మెషీన్లు రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవడం లేదా పాత యంత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించుకోవాల్సిన సమస్యలు లేనట్లే.

జూన్ 1 నుంచి ఫస్ట్ లెవల్ చెకింగ్

కొత్త గా వచ్చిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్‌ లను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, ఈసీఐఎల్ అధికారులు, అక్కడి పార్టీ నాయకుల సమక్షంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి నిర్వహించేందుకు సీఈఓ ఆఫీసు సిబ్బంది రెడీ అవుతున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 15 రోజుల పాటు కొనసాగే అవకాశమున్నది. అన్నీ కొత్త మెషీన్లు కావడంతో వాటి ఫంక్షనింగ్‌ను చెక్ చేయడంతో పాటు మాల్ ప్రాక్టీసు లాంటి అంశాలకు తావు లేకుండా పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఈ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం పూర్తి చేయనున్నది. ఏదేని పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగినా, అభ్యర్థుల సంఖ్య పెరిగినా దానికి తగినట్లుగా అదనపు మెషీన్లను సమకూర్చుకోవడంలో కూడా ఈసీఐఎల్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని సీఈఓ వర్గాలు వ్యక్తం చేశాయి.

సీఈఓ సిబ్బందితో ఈసీ టీమ్ సమీక్ష

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటిప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని ఇటీవల పంపారు. ఓటర్ల జాబితా తయారీ మొదలు గత ఎన్నికల సందర్భంగా జరిగిన తప్పొప్పులకు ఆస్కారం లేకుండా ఫూల్‌ ప్రూఫ్ పద్ధతిలో రెడీగా ఉండాలని ఆ బృందం సూచించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో చేరికలు, తొలగింపులు జరిగిన నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదుల అంశాన్ని సీఈఓ ఆఫీసర్లతో చర్చించింది. తాజాగా ముగిసిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా వేలాది ఓటర్ల తొలగింపుపై వచ్చిన కంప్లయింట్స్ లోని అంశాలపై కూడా వివరణ తీసుకున్నది. ఇలాంటి ఫిర్యాదులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాకుండా ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకే చిరునామాతో వేలాది ఓట్లు ఉన్న అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈసీ బృందం.. ఇలా ఉండకూడదన్న నిబంధన ఏమీ లేనప్పటికీ, అసాధారణమైనదిగానే గుర్తించాలని నొక్కిచెప్పింది. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఓట్ల విషయంలో వెరిఫికేషన్ జరపాలని పేర్కొన్నది. హైదరాబాద్ పాతబస్తీలో ఒకే ఇంటి నెంబర్‌తో వందలాది ఓట్లు ఉన్న విషయంపై విపక్షాలు అనేక ఫిర్యాదులు చేశాయి. ఇవన్నీ బోగస్ ఓట్లేనని నేరుగా ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఓటర్ల జాబితాలో అడిషన్స్, డిలీషన్స్ చేసేటప్పుడు అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ టీమ్ ప్రత్యేకంగా నొక్కిచెప్పినట్లు సీఈఓ వర్గాలు పేర్కొన్నాయి. ఓటర్ల జాబితాలో అనూహ్య మార్పులు, అసాధారణ చేరికలపై ఈసీ టీమ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

షెడ్యూలు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో జరగాల్సి ఉన్నా ఎప్పుడైనా రావచ్చని రాజకీయ పార్టీలు అనుమానిస్తున్న నేపథ్యంలో సన్నద్ధత, సన్నాహకాలపై కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన సమీక్ష సందర్భంగానే రాష్ట్ర సీఈఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది వివరాలను తీసుకుని కొరత గురించి ప్రత్యేకంగా చర్చించింది. సీఈఓ ఆఫీసులో ఒక అదనపు సీఈఓ పోస్టు దీర్ఘకాలంగా భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నందున వీలైనంత తొందరగా దీన్ని ఫిలప్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read...

బిగ్ న్యూస్: తెలంగాణ సర్కార్‌కు మరో కొత్త గండం.. BRS ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్..!!

Advertisement

Next Story

Most Viewed