సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారు.. KCR సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-29 15:25:41.0  )
సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారు.. KCR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు కావాలని.. ప్రజా సమస్యలు పట్టవన్నారు. గోదావరి జలాలను కర్ణాటక, తమిళనాడు తీసుకుపోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని సీతారామ ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 12 సీట్లు వస్తాయన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక కొట్లాడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే నిజమైన సంక్షేమం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు మరణిస్తే రూ.5లక్షలు ఇచ్చామన్నారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామన్నారని.. ఇప్పుడు తులం బంగారం అడిగితే కస్సుమంటున్నారని ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చమంటే తనను దూషిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణను సాధించిన నన్ను జైల్లో వేస్తారా అని ప్రశ్నించారు. జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతారా అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటున్నారని.. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఖండించలేదన్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావని గులాబీ బాస్ జోస్యం చెప్పారు. అయితే నామా కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత గులాబీ బాస్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో కలుస్తారా..? ఎన్డీఏ కూటమిలో కలుస్తారా అనే చర్చ మొదలైంది.

Advertisement

Next Story