Yadadri Bhuvanagiri : మూసీ సుందరీకరణకు మద్దతుగా ప్రజా చైతన్య ర్యాలీ

by Aamani |
Yadadri Bhuvanagiri :  మూసీ సుందరీకరణకు మద్దతుగా ప్రజా చైతన్య ర్యాలీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతూ ప్రజా చైతన్య నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర శనివారం పోచంపల్లి మండలం పిలాయిపల్లి చౌరస్తా నుండి పాదయాత్రగా బయలుదేరి పిలాయిపల్లి - మక్త అనంతారం గ్రామాల మద్యగా సాగింది. ఈ‌ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లు లేకుండా కట్టి ఆగం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.‌ మూసి నదిని పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ ద్వారా ప్రక్షాళన చేసి నదికి ఇరువైపులా షాపింగ్ మాల్స్ ( Shopping malls ) కట్టాలనే ఉద్దేశ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు వెల్లడించారు.

ప్రతిపక్షాలు మాత్రం ప్రజల కడుపు గొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్,రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజల మురికి నీళ్ల కష్టాల్ని తీర్చాలని, మూసీ నది ( Musi River ) మీద ఉన్న ప్రజలు, చేతి వృత్తుల వారు మురికి కూపంలో ఉంటున్నారని, వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చి, మురికి కూపం నుంచి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చేస్తుంటే, ప్రతిపక్షాలు మురికి ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు వారి విష ప్రచారం తిప్పి కొట్టాలని‌‌ పిలుపునిచ్చారు. మూసీ పరివాహక రైతులను ప్రతిపక్షాలు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు, ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడనేమో రాజకీయం చేస్తూ ఢిల్లీలో గొప్పలు చెప్తున్నారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ గంగా నది ప్రక్షాళన చేస్తే గొప్ప.. మా ప్రభుత్వం తెలంగాణ లో మూసీ నది ( Musi River ) చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ రైతుకు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండని ప్రశ్నించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఉన్న నదులు వాటి ప్రక్షాళన చేసిన విధానం, వేస్ట్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి తదితర వనరుల పునర్వినియోగంపై అక్కడి రివర్ ఫ్రంట్ అధికారులతో చర్చలు సమావేశాలు చేశామన్నారు. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా వ్యర్ధాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం సియోల్ లో వినియోగిస్తున్నారని, సీయోల్ నగరం నడిబొడ్డు నుండి ప్రవహించే చెంగిచియాన్ నది హైదరాబాద్ మధ్యలో ప్రవహించే మూసీ నది లాగా ఒకప్పుడు మురికి మయంగా ఉండేదన్నారు. ఆ నదికి పునరుద్యోగం పోశారని, నేడు అత్యంత సుందర నగరంగా సియోల్ మారిందని, తలపెట్టిన ముసీ నది ప్రక్షాళనతో హైదరాబాద్ నగరం కూడా మరో సియోల్ నగరంగా మారనుందన్నారు. నాడు మూసి నదికి ఉన్న పరిస్థితి ఏమిటో మన తండ్రులకు తాతలకు తెలుసని, వెనుకటి రోజుల్లో ఈ మూసీ నది నీళ్లు త్రాగే వారన్నారు.

అట్లాంటి మూసీ నది నీళ్లను నేడు మూగజీవాలు కూడా తాగే పరిస్థితి లేదని, మూసీ నది పరివాహక ప్రాంతంలో పండినటువంటి పంటను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసి నాటి పరిస్థితి తెచ్చుకుందామన్నారు. భావితరాలకు రక్షణగా ఉందామని, కాపాడుకుందామన్నారు.‌ మూసి ప్రక్షాళన చేయాలంటే రైతుల సహకారం అవసరం ఉందని, పరివాహాక రైతులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ నది ప్రక్షాళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, జిల్లాలోని ముఖ్య నాయకులు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు,మాజీ ప్రజాప్రతినిధులు,రైతులు, మహిళా రైతులు, మూసీ నదిపై ఆధారపడి జీవనం సాగించే చేతివృత్తుల వారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story