ఉమ్మడి నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం

by Kalyani |
ఉమ్మడి నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం
X

దిశ, డిండి: పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి త్వరితగతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో శుక్రవారం ఎస్ ఎల్ బి సి టన్నెల్ మన్నెవారిపల్లి వద్ద సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. గత పాలకులు గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేశారని, 1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 4 వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారం పడిందని తెలిపారు. ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తి చేయడానికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని, రాబోయే 2 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉమ్మడి నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.

నాడు పీపుల్ మార్చ్ పాదయాత్రలో ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంటుందని అది ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి రీడిజైన్ ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానా దివాలా తీసి రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయని తెలిపారు. గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కృంగిపోయిందని, కృష్ణా నదిపై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... ఎస్ ఎల్ బి సి టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ. 4400 కోట్లు పెంచి శుక్రవారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో మంజూరు చేస్తామని ఇకపై డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్షించాలని ఇరిగేషన్ సెక్రటరీ ఆదేశించారు. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణా నుంచి గత 10 సంవత్సరాలలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని తెలిపారు.

గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు సొరంగ మార్గం పూర్తికి పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ ఎల్ బి సి హై లెవెల్ కెనాల్ కు సంబంధించిన మరమ్మత్తులో ఉన్న 4 వ పంపును మూడు రోజుల్లో మరమ్మతు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నీరు డెడ్ స్టోరేజ్ కి వెళ్ళినప్పటికీ ఎస్ ఎల్ బి సి ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు అని తెలిపారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఓవర్ ఫ్లో అవుతున్నందున గొట్టిముక్కల, సింగరాజు పల్లి రిజర్వాయర్లను నింపుకోవచ్చని, అలాగే పిల్లాయిపల్లి కాలువ, బునియాధికాని కాలువ, ధర్మారెడ్డి కాల్వలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ.. నక్కలగండి ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ లో భాగంగా మన్నె వారి పల్లె కింద ఇండ్లు కోల్పోయిన వారికి ఇచ్చినట్లుగానే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. సింగరాజు పల్లి రిజర్వాయర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. నక్కలగండి కింద ప్రత్యామ్నాయ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి, నకిరేకల్, అచ్చంపేట, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, భువనగిరి శాసనసభ్యులు వేముల వీరేశం, డాక్టర్ వంశీకృష్ణ, జై వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ లు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్ లు నారాయణరెడ్డి, సంతోష్, నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, ఎస్ ఎల్ బి సి నిర్మాణ సంస్థ జయప్రకాష్ పంకజ్ గౌర్, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

Next Story