NIA: గురుపత్వంత్ సింగ్ కేసులో NIA దాడులు

by Harish |
NIA: గురుపత్వంత్ సింగ్ కేసులో NIA దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ, అతని నిషేధిత సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(SFJ)పై దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) శుక్రవారం పంజాబ్‌లో నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది. ఎన్‌ఐఏ బృందాలు, కేసులో ప్రమేయం ఉన్న అనుమానితులకు చెందిన మోగాలోని ఒక ప్రాంతం, బటిండాలోని రెండు ప్రదేశాలు, మొహాలీలో ఒకచోట దాడులు చేసినట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో అధికారులు డిజిటల్ పరికరాలతో పాటు, ఇతర అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించడానికి వారి వెంట తీసుకెళ్లారు. భారత్‌లో అల్లర్లు చేయడానికి, ఉగ్రదాడులు చేయడానికి ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(SFJ) చీఫ్ గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూ కుట్రలు పన్నుతున్నాడనే సమాచారంతో ఎన్‌ఐఏ బృందాలు ఈ దాడులు చేపట్టాయి.

గురు పత్వంత్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఖాంకోట్‌ గ్రామం. తండ్రి మహేందర్‌సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. దేశ విభజన సమయంలో అతని కుటుంబం పాకిస్థాన్‌ నుంచి ఇక్కడికి వచ్చింది. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి తరువాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి పౌరసత్వం తీసుకుని పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా (ఖలిస్థాన్‌) ఏర్పాటుచేయటం లక్ష్యంగా SFJను స్థాపించాడు.

Next Story

Most Viewed