అకాల వర్షాలు..అన్నదాతను ఆగం

by Naveena |   ( Updated:2024-10-13 15:24:47.0  )
అకాల వర్షాలు..అన్నదాతను ఆగం
X

దిశ, నడిగూడెం:అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వానలు రైతులను నట్టేట ముంచాయి.మండంలోని సిరిపురం, బృందావన పురం,రత్నవరం క్లస్టర్ల పరిధిలో గల ఎనిమిది గ్రామాల్లో 135 మంది రైతులకు చెందిన 201.5 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. నష్టపోయిన రైతాంగానికి తాజా రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు ఒక్కరోజు ముందుగా ఈ నెల 11న ఎకరాకు రూ. 10వేల సహాయాన్ని వారి వారి బ్యాంక్ అకౌంట్ లలో జమ చేసింది. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో అకాలంగా కురిసిన భారీ వర్షాల మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టకు కాగిత రామచంద్రాపురం 132, 133.5 కిలో మీటర్ల వద్ద గండి ఏర్పడింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. ఒక్క కేఆర్సీపురం రెవెన్యూ పరిధిలోనే 142.5 ఎకరాల వరి పంట పొలాలు నీట మునగడంతో.. పాటు సుమారు 40 ఎకరాల్లో ఇసుక మేటలు వేయగా, మరికొన్ని ఎకరాల్లో బండరాళ్లు తేలాయి. దీంతో పచ్చని పంటపొలాలు కోతకు గురై సాగుకు వీలులేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న పదివేల నష్ట పరిహారం ఏ మాత్రం సరిపోదని, తమ పొలాల్లో మేట వేసిన ఇసుకను, రాళ్లను తొలగించి భూములను సాగుకుయోగ్యంగా మార్చుకునేందుకు లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేటలు వేసిన భూములకు ప్రభుత్వం మరింత సాయం అందజేయాలని రైతులు కోరుతున్నారు.కగా గండి పడిన ప్రాంతాన్ని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సార్లు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వల్ల వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం గండి ప్రాంతాన్ని పరిశీలించిన విషయం విధితమే. కాల్వ కట్టకు పడిన గండి పూడ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.10 కోట్లను మంజూరు చేసి, నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతు పనులను చేపట్టి గత నెల 25 వ తేదీన అధికారులు సాగర్ నీటిని విడుదల చేసిన విషయం తెలుసిందే.

Advertisement

Next Story