ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష

by Sumithra |
ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష
X

దిశ, నల్లగొండ: టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నల్గొండలో పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజియూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి తనిఖీల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డా.లింబాద్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా రెండేళ్ల బీఈడి కోర్సులో ప్రవేశానికి నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సమావేశమైన అధికారులు సెట్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలన చేసి ప్రశ్నాపత్రాల కోడ్‌లను విడుదల చేశారు. నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని డిపిఎంఎస్ ఆన్లైన్ పరీక్ష కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజియూ వైస్ ఛాన్సలర్, టీఎస్ ఎడ్ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిహెచ్ .గోపాల్ రెడ్డి ,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి కృష్ణారావు, ఓ ఎస్ డి ప్రొఫెసర్ అల్వాల్ రవి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ టీఎస్ ఎడ్సెట్ కో కన్వీనర్, ఎన్ సి టి ఈ మెంబర్ ప్రొఫెసర్ శంకర్ పరిశీలించారు.

మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు.మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో టిసిఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ పట్టణాల్లో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.మొత్తం 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 27495 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 4232 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మూడు విడతలుగా జరగ్గా.. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు జరిగిన పరీక్షలో 85% మంది , రెండో విడత 12:30 నుండి 2:30 వరకు జరగగా 86%, మూడవ విడత నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 88% మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల కోడ్ విడుదల అనంతరం పరిశీలనకు వెళ్లిన ఆచార్య లింబాద్రి.. ఆన్లైన్ పరీక్ష విధానాన్ని వివరించారు.

సాంకేతికతను ఉపయోగించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా సమర్థవంతంగా, విద్యార్థులకు వ్యయ ప్రయాసలు లేకుండా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కమాండ్ కంట్రోల్ విధానం ద్వారా ప్రతి పరీక్షా కేంద్రాన్ని ఉన్నచోటనే క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం సైతం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎడ్ సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎడ్ సెట్ రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షను సవాలుగా స్వీకరించి ఎటువంటి పొరపాట్లు దొరలకుండా సమర్థవంతంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మరిన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు సాగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వారి వెంట టీఎస్ ఎడ్ సెట్ కో కన్వీనర్ , ఆచార్య పి శంకర్, ప్రత్యేక పరిశీలకులు, డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ, డాక్టర్ గంపల మధుకర్ , పరీక్షా కేంద్రం చీప్ సూపర్డెంట్ వి. రాఘవేంద్ర తోపాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీ. స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పిఆర్ఓ డాక్టర్ లక్ష్మల్ల మధు, ప్రోగ్రామర్లు శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ వెంకటాచారి, ప్రసాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, మహమ్మద్ ఇబ్రహీం, టీఎస్ ఎడ్ సెట్ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story