Nagarjunasagar : ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలకళ..

by Sumithra |
Nagarjunasagar : ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలకళ..
X

దిశ, నాగార్జునసాగర్ : కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌ కూడా జలసిరితో కళకళలాడుతోంది. శ్రీశైలం జలాశయం నిండటంతో వస్తున్న నీటిని నాగార్జున సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర డ్యాంల నుంచి దిగువకు వరద నీరు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.

కర్ణాటక సహా ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతిభారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ పరిణామంతో జూరాలతో పాటు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అధికారులు 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4,65,261 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,91,602 క్యూసెక్కులుగా ఉంది. అయితే, శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

548.40 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం..

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 4,91,602 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్‌ ఫ్లో 28878 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 548.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 201.9186 టీఎంసీలుగా ఉన్నది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, జూరాల, ఆలమట్టి డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు.

సాగర్ నిండితే పులిచింతలకు నీరు..

పులిచింతల ప్రాజెక్టు జలాశయ నీటిమట్టం 103.71 అడుగులుంది. 1.11టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండితే గేట్లు ఎత్తి పులిచింతలకు వరద నీటిని వదులుతారు. జూరాల ఎగువ ప్రాజెక్టులకు 2.85 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌లో 3.30 లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టికి 3.41 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తుంది. పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా వరద నీరు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

నేడు నాగర్జున సాగర్ ఎడమకు నీటి విడుదల..

నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి ఎడమ కాలువ నుంచి సాగు తాగు అవసరాల కోసం శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Advertisement

Next Story