Govt Whip Birla Ailaiah : నేతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..

by Sumithra |
Govt Whip Birla Ailaiah : నేతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : నేతన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయగిరి క్రాస్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికుల భారీ ర్యాలీని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే లతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేటులో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా వుంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

1905లో విదేశీ వస్త్రం వద్దు స్వదేశీ వస్త్రం ముద్దు అని ఉద్యమం చేపట్టారని, 2015 ఆగష్టు 7 నుండి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసిన నేతన్నలు పస్తులుండకూడదని అన్నారు. బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. నేతన్నలకు సబ్సిడీలతో పాటు అన్ని విధాలుగా ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, బయట రాష్ట్రాల మాదిరిగా నేతన్నలకు లబ్దిచేకూర్చేలా చేస్తామని, జీఎస్టీ తగ్గించేలా కృషి చేస్తామని, నేతన్నల సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వారి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బట్టను మనిషికి ఇచ్చింది నేతన్నేనని, అలాంటి నేతన్నల బాగు కోసం రైతు భరోసా లాగా నేతన్న భరోసాకు కృషి చేస్తామని తెలిపారు. నేతన్నల ఆర్థిక స్థితిగతులు పెరిగేలా అందరూ ఆలోచించాలని, నేతపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, నేత పురాతనమైనదని, అనాదిగా ఈ ఆచార సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ రాబోయే తరాలకు వారి కళను అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన పోచంపల్లి కళను మనం కాపాడాల్సి వుందని అన్నారు.

రాష్ట్రపతి పోచంపల్లి సందర్శనకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన చేనేత కళల స్టాల్స్ అద్భుతంగా వున్నాయని, ఆ చీరల పై వారి కష్టం కన్పించిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసాతో 60 లక్షల మంది రైతులకు 31 వేల కోట్లతో మేలు చేసిందని, రాష్ట్రం మొత్తం మీద 2లక్షల నేతన్నల కుటుంబాలు ఉంటాయని, వీరికి కూడా నేతన్న భరోసాకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టరు కామిల్ అహ్మద్, చేనేత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story