Suryapet: పెద్దగట్టు జాతరకు వేళాయె..

by Ramesh Goud |
Suryapet: పెద్దగట్టు జాతరకు వేళాయె..
X

దిశ, చివ్వెంల : తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు వేళైంది. జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ కార్యక్రమం సాంప్రదాయ బద్దంగా ఆదివారం అర్థరాత్రి ఆలయ వంశపారంపర్య పూజారులు నిర్వహించారు. దిష్టి పూజతో రెండు వారాల ముందే జాతరకు అంకురార్పణ జరిగింది. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర జరగాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16నుంచి 20వరకు దురాజ్‌పల్లిలో లింగమంతులస్వామి జాతర జరగనుంది. యాదవుల ఆరాధ్య దైవం పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 16నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దురాజ్‌పల్లి గ్రామంలో కొలువైన లింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. సమక్క-సారలమ్మ జాతర తరవాత అదే స్థాయిలో ఈ జాతరకు భక్తుల ప్రవాహం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు వస్తారు. మాఘమాసం అమావాస్య తరవాత వచ్చే మొదటి ఆదివారం జాతర జరుపుతారు. జాతర జరిగే రెండు వారాల ముందుగా జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ ఆదివారం అర్థరాత్రి యాదవ సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు.

ఘనంగా దిష్టిపూజ..

మొదటగా ఆనవాయితీ ప్రకారం సూర్యాపేట పట్టణానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామానికి మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్ట చేరుకుంది. ఈ పెట్టెలో లింగమంతుల స్వామి, సౌడమ్మ, ఎలమంచమ్మలతోపాటు 33మంది దేవతా విగ్రహాలు ఉంటాయి. హక్కుదారులుగా ఉన్న మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్థులు కేసారం గ్రామంలో మొదటి పూజ నిర్వహించి బోనం కుంబాలు, తల్లి, పిల్ల గొర్రెలతో యాదవ సాంప్రదాయం ప్రకారం డప్పు చప్పుళ్లు, బేరీల నృత్యాలతో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగింపుగా దురాజ్ పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టను తరలించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం హక్కుదారులు, వంశపారంపర్య పూజారుల ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో బోనం వండి పసుపు కుంకుమలతో పట్నం వేసి వండిన బోనాన్ని రాసులుగా పోసి దిష్టి కుంభాన్ని పెట్టి దీపారాధన చేసి మొక్కులు చెల్లించారు. ఒక వైపు బైకాన్ల కులస్థులు దేవుడి చరిత్రను పాటలుగా పాడుతుండగా మరో వైపు పిల్ల, తల్లి గొర్రెలను బలి ఇచ్చి ఆలయ ప్రాంగణంలో బలి ముద్దలు చల్లారు. దీంతో దిష్టి పూజ కార్యక్రమం ముగిసింది. తిరిగి దేవర పెట్టెను కేసారం తరలించి జాతర ప్రారంభం రోజు తీసుకొస్తారు. దిష్టి పూజా కార్యక్రమంలో ఆలయ పాలక వర్గం, భక్తులు, నాయకులు, యాదవులు తదితరులు పాల్గొన్నారు.

Next Story