Thungathurthi : తుంగతుర్తిలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు

by Mahesh |   ( Updated:2023-09-25 03:39:37.0  )
Thungathurthi  : తుంగతుర్తిలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు
X

దిశ, తుంగతుర్తి: శాసనసభ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడున్న నాయకులు రేపు ఎటు పోతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు చేస్తున్న జంపింగులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మొన్ననే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ప్రజలు మరువకముందే వైఎస్సార్ టీపీ నుంచి ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన ప్రజావర్గాన్ని కలిగిన ఈ ఇద్దరు నేతలు పార్టీలు మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని పొందడానికి ఆశావాహులు పడే కష్టాలు వర్ణించలేనివి. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి మందుల సామెల్, ఏపూరి సోమన్న పరిస్థితి విచిత్రం. తుంగతుర్తి అసెంబ్లీ గడ్డపై బీఆర్ఎస్ పార్టీని స్థాపించి పటిష్ట పరిచిన మందుల సామెల్‌కు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఏనాడు లభించలేదు. చివరికి 23 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ రాజకీయానికి స్వస్తి పలికి వారం రోజుల క్రితమే సామేలు కాంగ్రెస్ నీడన చేరారు. ఇక ఏపూరి సోమన్నది మరో విచిత్ర పరిస్థితి. సాంస్కృతిక కళాకారుడు, గాయకుడైన సోమన్న తుంగతుర్తి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగి ఉండడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో విశేషమైన పాత్రను పోషించారు. వైఎస్సార్ టీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ షర్మిల చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలో కీలకంగా నిలిచారు.

ఈ తరుణంలో రెండేళ్ల క్రితమే పార్టీ తరఫున తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని అధినేత్రి షర్మిల ప్రకటించారు. దీంతో ఉత్సాహంగా సోమన్న ఓవైపు తన ప్రాంతమైన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని చేసుకుంటూనే మరోవైపు రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో తల మునకలయ్యారు. అయితే ఇటీవల కాలంగా కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీన ప్రక్రియను సోమన్న విభేదిస్తూ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తుంగతుర్తి టికెట్ కూడా తనకే ఇప్పించాలనేది సోమన్న ప్రధాన డిమాండ్. కానీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నప్పటికీ ఎలాంటి క్లారిటీలు రాలేదు. చివరికి ఆశలు వదులుకున్న సోమన్న బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.

గతంలోనే సోమన్నకు సీఎం కేసీఆర్ ఆహ్వానం

ముఖ్యంగా వైఎస్సార్ టీపీ పార్టీలో అసంతృప్తితో రగులుతున్న ఏపూరి సోమన్నకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానాలు పంపాయి. ఒక దశలో సీఎం కేసీఆర్ స్వయంగా సోమన్నకు ఆహ్వాన సంకేతాలు పంపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సాంస్కృతిక కళా రూపంలో వన్నె తెస్తున్న గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి లోటును సమర్ధుడైన వారితో పూడ్చుకోవాలని సీఎం కేసీఆర్ భావించి ఏపూరి సోమన్న పేరును తెరపైకి తెచ్చారు. అంతేకాదు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు తోడుగా పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల మూలంగా సోమన్న దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

నాడు ఉప్పు..నిప్పు..! నేడు ఓకే పార్టీలో..!!

తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, ఏపూరి సోమన్నలు ఒకప్పుడు పార్టీలపరంగా ఉప్పు నిప్పుల చిటపటలతో ఉండేవారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగే సోమన్న అధికార పార్టీపై ప్రజలను ఆకట్టుకునే విధంగా విమర్శలు సంధించేవారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సోమన్న పై విమర్శలు వెళ్లేవి. ఇలాంటి తరుణంలోనే సోమన్న అధికార పార్టీలోకి వెళుతుండటం అందరిలో చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed