రఘురాములు హత్యకు ఆమె సూత్రధారి !

by Sumithra |
రఘురాములు హత్యకు ఆమె సూత్రధారి !
X

దిశ, దేవరకొండ : జూన్ 26న పట్టణంలో పులిజాల రఘురాములు హత్య సంచలనం సృష్టించి, పలు అనుమానాలకు దారితీసింది. కాగా దేవరకొండ పోలీసులు ఈ హత్యకు కారణమైన వారిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కారును, 4 సెల్ ఫోన్ లను, కొంత సైనేడ్ పౌడర్ ను రికవరీ చేసి నిందితుల పై Cr.no159/2023 U/s 302 120 (b), 201R/w 34 IPC పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేకా నాగేశ్వరరావు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ నెల 26వ తేదీన ఉదయం స్థానిక మిషన్ కాంపౌండ్ వద్ద హత్యకు గురైన పులిజాల రఘురాములు బంధువులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అక్కడికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు. దేవరకొండ పట్టణంలో విష్ణు కాంప్లెక్స్ లో పులిజాల రఘురాములు సెంట్రల్ కిడ్స్ వేర్ షాపు నిర్వహిస్తూ, స్థానిక సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంపు వెండర్ గా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తూ, తాగుడుకు బానిసై అప్పులు చేసి, భార్య శ్రీలక్ష్మిని హింసించేవాడని డీఎస్పీ తెలిపారు.

రఘురాములు టార్చర్ భరించలేక ఎలాగైనా అతనిని వదిలించుకోవాలని అతను తాగే మద్యంలో పలుమార్లు వయాగ్రా టాబ్లెట్లు అధికంగా కలిపేదని ఆయన తెలిపారు. ఆమె చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆమె ఫ్రెండ్ ను తన భర్తను కాళ్లు చేతులు పనిచేయకుండా చేయడానికి సుపారి ఇవ్వడానికి మాట్లాడిందని చెప్పారు. దానికి ఆమె ఫ్రెండ్ ఒప్పుకోకపోవడంతో, ఆమె ఫ్రెండ్ భర్త అయిన చిలుక రాజు అరుణ్ తో డైరెక్ట్ ఇన్ స్టాగ్రామ్ లో మాట్లాడుతూ ఎలాగైనా తన భర్తని చంపాలని ఐదు లక్షల రూపాయలు సుపారి ఇస్తానని మాట్లాడుకొని రఘురాములతో స్నేహం చేయడానికి అరుణ్ కి లక్ష రూపాయలు అప్పుగా ఇప్పించి! ఇద్దరు కలిసి తిరిగే విధంగా ప్లాన్ చేసింది.

అందులో భాగంగా చిలక రాజు అరుణ్ దేవరకొండకు వచ్చినప్పుడల్లా రఘురాములకు తాపిస్తూ మద్యంలో సైనేడ్ బిల్లలు పౌడర్ పోసి మద్యం తాగించేవాడు. అయినా ఏమీ కాకపోవడంతో మరోసారి కారు యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు. అది కూడా విఫలం కావడంతో 26-06-2002 నాడు సాయంత్రం రఘురాములు అప్పుతీసుకున్న లక్ష రూపాయలు డబ్బులు కావాలని అరుణ్ మృతుడి పై ఒత్తిడి తేవడంతో సాయంత్రం దేవరకొండకు రూ.10వేలు ఇస్తానని చెప్పడంతో హైదరాబాదు నుండి TS05 UC- 6200 నెంబర్ కారులో చిలుక రాజు అరుణ్, ముక్కెర భాను, పెనుగొండ రవితేజ, సుచిత్రలు కలిసి 6 గంటల దేవరకొండ ప్రాంతంలోని మిషన్ కాంపౌండ్ వద్ద చేరుకొని రఘురాములకు ఫోన్ చేసి డబ్బులు తీసుకొని రమ్మనగా మృతుని భార్య నిర్వహిస్తున్న సెంట్రల్ కిడ్స్ వేర్ షాపును బందు చేసి భార్యను ఇంటి వద్ద దింపి, రాత్రి 8:30 గంటల సమయంలో మిషన్ కాంపౌండ్ దగ్గరకు వెళ్ళినాడు.

మృతుడు రాగానే కారులో నుండి ముగ్గురు దిగి అతని దగ్గరికి వచ్చి చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ముగ్గురు కలిసి మృతుడితో గొడవపడి మృతుని కిందపడేసి, మృతుడు లేవకుండా అతనిని ఇద్దరు పట్టుకొనగా చిలక రాజు అరుణ్ తనతో తెచ్చుకున్న సైనేడ్ కలిపిన మందును నోట్లో, ముక్కులో పోసి మృతుడు చనిపోయే వరకు మూతి, ముక్కును, అదిమి పట్టి మూసినారు, మృతుడు చనిపోయాడని నిర్ధారించుకొని, అక్కడి నుండి వచ్చిన కారులో తిరిగి వెళుతూ మార్గమధ్యలో మృతిని భార్యకు శ్రీలక్ష్మికి చిలక రాజు అరుణ్ అందాజ రాత్రి 10 గంటల సమయంలో ఇంస్టాగ్రామ్ ద్వారా కాల్ చేసి ఆమె భర్తను చంపేశామని చెప్పినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నాలుగవ ముద్దాయి అయినా సుచిత్ర పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కేసును త్వరగా చేదించిన సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ పందిరి పరుశురాం, ఎస్సై కస్తూరి సతీష్, ఐడి పార్టీ కానిస్టేబుల్ హేము నాయక్, తిరుపతి, బాలు నాయక్, హెచ్ జీలు తిరుమల్, చంద్రమౌళి పాల్గొన్నారు.

Advertisement

Next Story